ఉద్యోగాల భర్తీపై టీడీపీ తప్పుడు ప్రచారం

చదువురాని లోకేష్‌.. విద్య గురించి మాట్లాడటం ఏపీకి పట్టిన దౌర్భాగ్యం

టీడీపీ హ‌యాంలో ఇచ్చిన ఉద్యోగాలెన్నో చెప్పే ద‌మ్ముందా..? 

బాబు ‘మనసులో మాట’ పుస్తకంలో ఉద్యోగులను కించపరిచేలా రాతలు

రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

రెండేళ్లలో 1.84 లక్షల రెగ్యులర్‌, 4 లక్షలకు పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలిచ్చాం

వచ్చే ఏడాది మరిన్ని ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తాడేపల్లి: దేశ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రెండేళ్లలోనే నిరుద్యోగులకు అనేక విధాలుగా ఉద్యోగ వసతి కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంచి చేస్తుంటే జీర్ణించుకోలేక.. ఏదోవిధంగా ప్రభుత్వం బురదజల్లాలనే లక్ష్యంతో నిరసన కార్యక్రమాలు అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పే దమ్మూ, ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. చదువు సంధ్య లేని లోకేష కూడా నిరుద్యోగం, విద్య గురించి మాట్లాడటం ఏపీకి పట్టిన దౌర్భాగ్యమన్నారు. తమ దగ్గర ఉన్న వివరాల ప్రకారం చంద్రబాబు 8,048  ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి ఒకే విడతలో 1,21,518 మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. సచివాలయాల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన వెంటనే చంద్రబాబు అండ్‌ కంపెనీ లేనిపోని విమర్శలతో నిరుద్యోగుల మనోభావాలు గాయపరిచే విధంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ విషప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ప్రతిభకు పెద్దపీట వేసి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. సచివాలయ ఉద్యోగులతో పాటు 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులను చిరునవ్వుతో ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ వారి ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. రెండేళ్ల కాలంలోనే 1.84 లక్షల ఉద్యోగాలిచ్చారని చెప్పారు. వీటితో పాటు కాంట్రాక్టు కింద 19,791 ఉద్యోగాలు, ఔట్‌సోర్సింగ్‌ కింద 4 లక్షలు. మొత్తం కలిపి 6,03,756 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. 

టీడీపీ హయాంలో ఇన్ని ఉద్యోగాలిచ్చామని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు, లోకేష్‌కు ఉందా..? అని ఎమ్మెల్యే కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత నీచమైన వ్యక్తిత్వం అంటే.. మనసులో మాట పుస్తకంలో వ్యవసాయాన్ని ఏ విధంగా కించపరిచారో.. ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా రాసుకున్నాడన్నారు.  ‘ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిందని, రెవెన్యూ, పోలీస్, విద్యుత్‌ వంటి శాఖల్లో అవినీతి విచ్చలవిడి అయిపోయిందని ఆ పుస్తకంలో రాసుకున్నాడు. వీటిని నియంత్రించాలంటే ఇతర దేశాల్లో మాదిరిగా ప్రైవేటేషన్‌ ఒక్కటే మార్గం.. ప్రభుత్వ ఉద్యోగాలకు స్వస్తి పలికి ఔట్‌సోర్సింగ్‌ కింద తీసుకుంటే సోమరితనం తగ్గుతుంది.. ఉద్యోగ భద్రత లేకుండా ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేస్తారు’ అని చంద్రబాబు రాసుకున్నాడు. 

జాబ్‌ క్యాలెండర్‌ డిపార్టుమెంట్‌ వైజ్‌ ఖాళీలను బట్టి విడుదల చేశామని, వచ్చే ఏడాది మరిన్ని ఖాళీలను భర్తీ చేసేలా జాబ్‌క్యాలెండర్‌ ఉంటుందన్నారు. నోటిఫికేషన్స్‌ బట్టి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తే.. ఎప్పుడూ ఒక్క ఉద్యోగం ఇవ్వని వ్యక్తి, ఉద్యోగస్తులను పట్టించుకోని చంద్రబాబు లాంటి వ్యక్తులు రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాయలో వామపక్ష పార్టీలు జతకట్టడం దురదృష్టకరమన్నారు. దళారీలతో సంబంధం లేకుండా 1వ తేదీన జీతభత్యాలు చెల్లించడానికి ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారన్నారు. 

2.34 లక్షల మందికి ఉద్యోగాలిస్తాను.. అన్ని ఖాళీలు ఉన్నాయని చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని ఎమ్మెల్యే కాకాణి గుర్తుచేశారు. ఏరోజు అయినా వాటి గురించి మాట్లాడారా..? ఆ ఖాళీలు గతంలో నింపిన పరిస్థితి ఉందా..? ఎందుకు ఆ రోజున ఈ వామపక్షాలు, నేటి ప్రతిపక్షాలు ప్రశ్నించలేకపోయాయి..? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇంటికో ఉద్యోగం వచ్చిందా..? నిరుద్యోగ భృతి వచ్చిందా..? వీటిపై చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయారు.? అని వామపక్షాలను ప్రశ్నించారు. 

ఈ రాష్ట్రంలో పనిచేసే వ్యక్తులను పనిగట్టుకొని విమర్శించాలనే దుర్బుద్ధి ఉన్న వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే కాకాణి ధ్వజమెత్తారు. అమెరికాకు వెళ్లి చదువుకోలేక వెనక్కు వచ్చిన ఆయన కుమారుడు లోకేష్‌.. అమెరికాలో చేసిన ఘనకార్యాలు విన్నాం.. చూశామని ఎద్దేవా చేశారు. చదువుసంధ్య లేని లోకేష్‌ లాంటివ్యక్తి నిరుద్యోగుల గురించి, విద్య గురించి మాట్లాడటం ఏపీకి పట్టిన దౌర్భాగ్యమని మండిపడ్డారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top