తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్ విష పురుగుల్లా తయారయ్యారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు ఖాయమని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తప్ప ఎవరూ నాయకులెవరూ ఉండరన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలే ఛీ కొడుతున్నారన్నారు. అబ్బాకొడుకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే.. ఆ నోళ్లను ఫినాయిల్‌తో కడగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా ఫస్ట్ వేవ్‌లో చంద్రబాబు, లోకేష్ ఏపీ వదిలి పారిపోయారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దేశం వదిలిపోయే పరిస్థితి వస్తుందన్నారు. 2019 ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా.. తండ్రీకొడుకుల తీరు మాత్రం మారలేదని ధ్వజమెత్తారు. ఏం పీకుతావ్ అనే మాటలు మాట్లాడుతున్నారంటే.. తండ్రీకొడుకులు రాజకీయంగా ఎంత దిగజారిపోయారే అర్థం అవుతుందన్నారు. ‘వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ధాటికి.. ధీశాలి వైయస్ జగన్ నాయకత్వం ధాటికి మీ అబ్బే ఏం పీకలేక చతికిలపడ్డాడు.. నువ్వేం పీకుతావ్ లోకేశం బాబూ’ అని చురకలంటించారు. చంద్రబాబు, లోకేష్‌ను ప్రజలే కలుపుమొక్కల్లా పీకేశారన్నారు. అమరావతి నడిబొడ్డు మంగళగిరిలో చిత్తుచిత్తుగా లోకేశంను ఓడించారన్నారు. మనసున్న ముఖ్యమంత్రి విశాల హృదయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేస్తున్నారని, వారంతా సీఎంకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ విజయం తధ్యమని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ దేశం విడిచి సింగపూర్ వెళ్లిపోవాల్సిందేనన్నారు. విజయవాడ నగరంలో టీడీపీ నిట్టనిలువునా చీలిపోయిందని, కమ్మ, కాపు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు కేశినేని, బోండా ఉమా టీడీపీలో ఉంటారా..? తెలుగుదేశం పార్టీ మొత్తం కుదేలైపోయి.. ఎటువెళ్లాలో తెలియని పరిస్థితుల్లో నాయకులు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. స్థలాలు చూపిస్తాం.. దమ్ముంటే చంద్రబాబు అయినా, లోకేశం బాబు అయినా రావాలని సవాల్ విసిరారు.