ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారింది

అవినీతిపాలన అంతమై ఏడాదైందని సంతాప సభ పెడుతున్నారా..?

అక్రమ కట్టడం కూల్చేస్తే సంతాపం ప్రకటిస్తారా..? సిగ్గులేదా..?

విధ్వంసానికి కాదు.. చంద్ర‌బాబు దోపిడీ అంతానికి ఏడాది

ఎల్లో మీడియాలో కనిపించాలనే ఎల్లో గ్యాంగ్‌ తాపత్రయం

టీడీపీ తీరుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజం

తాడేపల్లి: చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు చెక్‌పెట్టి ఏడాది పూర్తయిందని  సంతాప సభ పెట్టేందుకు ఎల్లో గ్యాంగ్‌ అంతా వెళ్లిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. అక్రమ కట్టడాన్ని కూల్చేస్తే దానికి సంతాపం ప్రకటిస్తారా..? సిగ్గులేదా..? కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఎల్లో గ్యాంగ్‌ అంతా ఎల్లో మీడియాలో కనిపించాలనే ఆత్రుత తప్ప మరేమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చంద్రబాబు అవినీతి పరిపాలనను అంతం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా సంతాప సభ పెట్టేందుకు వెళ్లారా..? మీ అక్రమాలకు చరమగీతం పాడినందుకు సంతాప సభ పెట్టేందుకు కూల్చేసిన అక్రమ కట్టడం ప్రజా వేదిక వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన ఆందోళన చేయడానికి ఒక్క సమస్య అయినా గుర్తించగలిగారా..? అని నిలదీశారు. ప్రతిపక్షానికి అవకాశం కూడా ఇవ్వకుండా చెప్పిన ప్రతీ  హామీని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారన్నారు. 

విధ్వంసానికి ఏడాదని ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్టు పెట్టారని, కానీ.. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు అవినీతి, అక్రమాలకు చెక్‌ పెట్టే ఏడాది పూర్తయిందని సంబరాలు చేసుకుంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చారని హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఒక్క సంవత్సర కాలంలో 3.92 కోట్ల మందికి సంక్షేమ ఫలాలను అందించామని, రూ.43 వేల కోట్లను నేరుగా పేదల బ్యాంక్‌ ఖాతాలోకి పంపించి మేలు చేశామన్నారు. విధ్వంసానికి ఏడాదని పోస్టు పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలంతా చిత్తశుద్ధితో అభినందిస్తున్నారన్నారు. నిబద్ధతతో, నీతితో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ప్రజా పరిపాలన చేస్తోందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లాలని ఎల్లో గ్యాంగ్‌ రంకెలు వేస్తుందని మండిప‌డ్డారు.. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని కొందరు పచ్చ నేతలు మాట్లాడుతున్నారని, కుట్రలు, కక్షసాధింపులు చేయాల్సిన అవసరం వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానికి లేదన్నారు. తప్పు చేశాడు కాబట్టే ఆధారాలతో సహా అరెస్టు చేశారని, అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలియగానే మంచి వైద్యాన్ని అందించాలని స్వయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. 

Back to Top