అసెంబ్లీ: గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో గత 8 సంవత్సరాలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునరుద్ధరించాలని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. కోరుకొండ మండల పరిధిలోని రెండు, మూడు గ్రామాలకు చెందిన సుమారు 15 వేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోరుకొండ మండలంలో రిజిస్ట్రేషన్లు, సీతానగరం మండలం డిగ్రీ కాలేజీకి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే రాజా అసెంబ్లీలో ప్రస్తావించారు.
గతంలో ఇనామ్ యాక్ట్, ఎస్టేట్ అబాలిష్‌మెంట్ యాక్ట్‌కు రెండింటికీ తేడా తెలియకుండా కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన తప్పిదాలకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 330 ఎకరాలను రిలీజ్ చేసిందన్నారు. మిగిలిన దాదాపు 17 వందల ఎకరాలకు సంబంధించి లా డిపార్టుమెంట్, ఎండోమెంట్ డిపార్టుమెంట్, రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి పరిష్కరించాల్సిందన్నారు. ఇప్పటికే పలుమార్లు సంబంధింత మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సమస్యను తొందరగా పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. సీతానగరం మండలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సైన్స్ కోర్సు మంజూరు చేశారు కానీ, సిబ్బంది కేటాయించలేదు. సిబ్బందిని తొందరగా ఏర్పాటు చేయాలని కోరారు.