అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత ప్రజలు పండగ చేసుకుంటున్నారు

లెజిస్లేటివ్‌ రాజధానితో అమరావతి ప్రజలు ఆనందంగా ఉన్నారు

హైకోర్టు వస్తుండటంతో రాయలసీమ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైయస్‌ జగన్‌ పాలన

అమరావతి రాజధాని దేశంలోనే అతిపెద్ద కుంభకోణం

రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే లోకేష్‌ ఎందుకు ఓడిపోయారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్‌

 

తాడేపల్లి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన చేసి  రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటనతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం కనిపిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.  విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్‌ క్యాపిటల్‌), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేసేందుకు వీలుందని సీఎం వైయస్ జగన్‌ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

 ప్రపంచంలో, దేశంలో రెండు, మూడు, నాలుగు రాజధానులు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు ఉండటం మంచిదని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రతిపాదనలు స్వాగతించాలి. నిన్నటి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతమంతా కూడా ఒక పండుగ వాతావరణం కనబడుతుంది. రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనతో రాయలసీమ ప్రాంతం ఉప్పొంగిపోతోంది.అమరావతి ప్రాంతాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం చెప్పిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం కనబడుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత ప్రజలు, రాయలసీమ అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత ప్రజలు, ఇప్పటికే లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా ఉన్న అమరావతి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా విశాఖవాసిగా, ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా   అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని  అడ్మినిస్ట్రేటివ్‌ రాజధానిగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిపాదించిన సందర్భంలో మరోసారి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
ఈ రోజు సంక్షేమ పథకాలు మారుమూలప్రాంతాలకు ఏరకంగా అందాలని మనం కోరుకుంటాం. కిందిస్థాయిలో పేదవాడికి అందించాలని మనం కోరుకుంటాం. ఆ రకంగానే అడ్మినిస్ట్రేషన్‌ కూడా గ్రామ స్థాయికి తీసుకెళ్లి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు. గ్రామస్థాయిలో సెక్రటరీయెట్‌ వ్యవస్థ గొప్ప ఉదాహరణ. అమరావతికి ప్రజలు ఏరకంగా భూములు ఇచ్చారో నిన్నటి సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. అమరావతి రాజధాని అనే ఆలోచన ..ఇది తెలుగు దేశం పార్టీ చేసిన ఆలోచన దేశ చరిత్రలోనే అది ఒక పెద్ద కుంభకోణంగా మేం అభివర్ణిస్తున్నాం. దాన్ని ప్రజల ముందు పెట్టాం. వారు చేసిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచాం. 2014లో ప్రజలు ఇచ్చిన తీర్పున చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2014 ఆగస్టు 15న కర్నూలులో చంద్రబాబు చేసిన ప్రకటనలు చూశాం. జిల్లాల వారీగా హామీలు ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తామని, విశాఖను మెగా సీటి చేస్తామని ప్రకటించారు. 13 జిల్లాలకు అనేక వాగ్ధానాలు చేశారు. 9 నగరాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన వ్యక్తి అమరావతిలో కనీసం 9 భవనాలు కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం కోర్‌ క్యాపిటల్‌ కోసం 55 వేల ఎకరాలు సేకరించారు. ఒక్కో ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన వ్యక్తి ..దాదాపు రూ. లక్ష పది వేల కోట్లు ఈ రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు చెప్పారు. రాజధానికే అంత ఖర్చు చేస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయగలం. గ్రామీణ ప్రాంతాలను ఏ రకంగా పైకి తీసుకురాగలం. చంద్రబాబు ఆలోచనలు కేవలం..వారి వర్గానికి, వారి పార్టీ నేతలకే ఉపయోగపడుతాయన్న కోణంలోనే అమరావతిని ఎంపిక చేశారు. ఆ రోజు కనీసం శివరామకృష్ణ కమిటీ  ఇచ్చిన రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఏ రోజు రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. పైపెచ్చు నిన్న అసెంబ్లీలో చెబుతారు. 1500 మందితో ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నామని చంద్రబాబు అంటున్నారు. ఇది హాస్యాస్పదం కాదా?. మీ సొంత లాభాల కోసం అసెంబ్లీని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారు. మీరు ఇంత అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రాంతంలో మీ పుత్రరత్నం ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పగలరా?. 33 వేల ఎకరాలు సేకరించామని గొప్పులు చెప్పుకుంటున్న మీరు..ఆ భూములు ఇచ్చిన రైతులకు, ఈ ప్రాంత వాసులు మీ కుమారుడిని ఎందుకు గెలిపించలేదు. మీరు ఏ ఉద్దేశంతో ఉమ్మడి రాజధానిని విడిచి ఆఘమేఘాలపై అమరావతికి వచ్చింది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ స్వప్రయోజనాల కోసం ఓటుకు నోట్లు కేసులో దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి అవసరాల కోసమే అమరావతిని వాడుకున్నారు. 2017లో చంద్రబాబు ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకున్నారా? ఉమ్మడి రాజధానిలో సొంత ఇంటిని నిర్మించున్నారే.. ఇక్కడేందుకు ఇళ్లు కట్టుకోలేదు. ఈ ప్రాంత ప్రజలు ఏరకంగా మిమ్మల్ని నమ్ముతారు. ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి జరుగుతుందని ఆశించలేదనడానికి మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటల గమనిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంత ద్రోహిగా మిగిలిపోతున్నారు. మీకు ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. కేవలం అమరావతిలోని 55 వేల ఎకరాలు ఉంటే చాలు..రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏమైనా ఫర్వాలేదన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సందర్భాల్లో 13 జిల్లాలు మావి కావు..13 జిల్లాల ప్రజలతో మాకు సంబంధాలు లేవు..మాకు అమరావతి ఉంటే చాలు ఆంధ్రరాష్ట్రం ఏమైపోయిన ఫర్వాలేదు అన్న అభిప్రాయం మీకుంటే రాజకీయ పార్టీ ఎందుకు? మీరు టీడీపీ పార్టీని నడపాల్సిన అవసరం ఏముంది? మీరు గతంలో తీసుకువచ్చిన అమరావతి కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఏర్పాటు చేశారు తప్ప..రాజధాని నిర్మాణం చేసి  రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చి..ప్రజల అభిప్రాయాలు తీసుకొని  ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, నిర్మాణాలు చేపట్టాలని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఐదేళ్లలో రాజధాని కోసం కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో డీపీఆర్‌ల కోసం, కన్సల్టెన్సీ ఫీజుల కోసం, రాజధాని రైతులను సింగపూర్‌కు తిప్పడం కోసం దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేశారు.  పైపెచ్చు మన రాష్ట్రంలోనో, మన దేశంలోనూ ఉన్న ఇంజినీర్లు ఈ ప్రాంతాన్ని నిర్మాణం చేస్తామని ముందుకు వస్తే..మన ఇంజినీర్లు మురికివాడలు కడతారని అవహేళన చేశారు. సింగపూర్, మలేషియా నుంచి కన్సల్టెన్సీలను తెచ్చుకుంటానని మాట్లాడారు. చదువుకున్న ఇంజినీర్లను కించపరిచారు. రాజధానికి రూ. లక్ష కోట్లు అవవసరమైతే, దానికి అయ్యే వడ్డీలు ఎలా కట్టాలి. మిగిలిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయి. రాయలసీమ ప్రాంతానికి నీరు  ఇవ్వాలంటే రూ.60 వేల కోట్లు అవసరం ఉంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో రిజర్వాయర్లు నిండే పరిస్థితి లేకపోతే, కెనాల్‌ను విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి. అందుకే సీఎం వైయస్‌ జగన్‌ అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారని, ప్రజలు సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ తెలిపారు. 
 

Back to Top