కోర్టు ఆర్డర్‌ను వక్రీకరించి టీడీపీ దుష్ప్రచారం

గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువ

ఆక్రమిత భూమి స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు

అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయం

స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాలకు వినియోగిస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా కనిపిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. వేల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడం సరికాదన్నారు. గీతం ఆక్రమించిన భూమి ప్రభుత్వ భూమి అని చెప్పడానికి ఆగస్టు 3న సీఎంకు రాసిన లేఖ కంటే రుజువు కావాలా..? అని ప్రశ్నించారు. గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

బాలకృష్ణ అల్లుడు, నారా లోకేష్‌ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడడం విడ్డూరమన్నారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. గీతం యాజమాన్యం కోర్టు ఆర్డర్‌ను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తోంది. రిట్‌ పిటిషన్‌ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని కోర్టు సూచించిందని, కానీ టీడీపీ పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

‘గీతం యాజమాన్యం ఆగస్టు 3వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు లేఖ రాశారు. ఎండాడ విలేజ్‌లో 43 ఎకరాల భూమి మాకు రెగ్యులరైజ్‌ చేయండి అని రాశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న గీతం యాజమాన్యం ఆ భూమిని మాకు క్రమబద్దీకరించండి.. ఎంత ఫిక్స్‌ చేస్తే అంత కడుతామని లేఖ రాశారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పేందుకు ఇంతకంటే రుజువు కావాలా..?’ అని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు విశ్వవిద్యాలయం అవసరాల కోసం 71 ఎకరాలు ఇచ్చాయి. 71 ఎకరాలకు ఆనుకొని గీతం యూనివర్సిటీ సొంత భూమి 30 ఎకరాలు ఉన్నప్పటికీ సొంత భూమి రియల్‌ ఎస్టేట్‌ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుంది. అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కొట్టేయాలని చూశారన్నారు.  

గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుందని ఎమ్మెల్యే అమర్‌ చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు.. వాటిని ఆధారాలతో సహా రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తన అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నాడన్నారు. 
 

Back to Top