విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, రూ.800 కోట్లు విలువ చేసే భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని, భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టు కేసుల్లో లేదు, ఓ ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. బాలకృష్ణ అల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి భూమి స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గోగ్గులు పెడుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్ ప్రశ్నించారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నవారంతా అత్యంత అవినీతికి పాల్పడ్డవారే అని, ఈఎస్‌ఐ స్కామ్‌లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారని దుయ్యబట్టారు. భూములు కాజేసినవారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని, టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందన్నారు. ఆక్రమించిన భూమికి నోటీసీలు ఇవ్వకుండా, వందల కోట్ల విలువ చేసే భూమి అక్రమిస్తే చూస్తూ ఉరుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలు అంటూ బురదజల్లుతున్నారని, విలువైన భూములు ఆక్రమిస్తూ చూస్తూ ఊరుకోమన్నారు. విశాఖలో ఆక్రమణకు గురైన విలువైన భూములు కాపాడుతామని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.