చంద్రబాబు బ్యాక్‌డోర్‌ పొలిటీషియన్‌

వైశ్రాయ్‌ బాగోతం నుంచి నేటి వరకు బాబులో మార్పురాలేదు

అమరావతి వేదికగా అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాడు

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆధారాలు చూపించగలవా..?

అన్నం పెట్టిన చేతినే నరుక్కుంటున్న ఈనాడు

స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు భూమి పూజ చేస్తే రాద్ధాంతం ఎందుకు..?

రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

14 నెలల్లో రూ.60 వేల కోట్లతో సంక్షేమ ఫలాలు అందించిన సీఎంను దేశ చరిత్రలో చూపించగలరా..?

చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌

తాడేపల్లి: వైశ్రాయ్‌ హోటల్‌ బాగోతం నుంచి నేటి వరకు చంద్రబాబులో మార్పు రాలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబు బ్యాక్‌ డోర్‌ పొలిటీషియన్‌ అని, కుట్రలు, కుతంత్రాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, సీఎం నిర్ణయానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారన్నారు. చంద్రబాబు తన రియలెస్టేట్‌ వ్యాపారం కోసం ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

మూడు రాజధానులపై చంద్రబాబు, ఎల్లో మీడియా అనేక సందర్భాల్లో కుట్ర చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర సమాగ్రాభివృద్ధే సీఎం ధ్యేయం. 1956లో చెన్నైని కోల్పోయాం. 2014లో హైదరాబాద్‌ను కోల్పోయాం. మళ్లీ అటువంటి పరిస్థితి ఉండకూడదని, వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే ఎప్పుడు బుద్ధి వస్తుందో అర్థం కాని పరిస్థితి. 

30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మొదలు మూడు రాజధానుల వరకు అన్ని అంశాల్లో అడ్డుపడుతున్నారు. పేదవాడికి ఇల్లు ఇవ్వాలని సీఎం ఆలోచన చేస్తే.. దాన్ని అడ్డుకుంటున్నారు. అమరావతిలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తే అసలు ఇక్కడ ఉండటానికే వీల్లేదు.. మా కులం తప్ప అమరావతిలో ఎవరూ ఉండటానికి వీల్లేదని హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లో ప్రస్తావించారంటే.. చంద్రబాబు ఏ మేరకు అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తున్నారో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. 

కరోనా వైరస్‌కు మందు వస్తుందేమో కానీ, చంద్రబాబు కడుపు మంటకు మందు లేదని గతంలో సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఎల్లో వైరస్‌ను కట్టడి చేసే మందే లేదు. ఎన్టీఆర్‌ వెన్నుపోటు, వైశ్రాయ్‌ హోటల్‌ బాగోతం దగ్గర నుంచి నేటి వరకు కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే వస్తున్నారు. నచ్చకపోతే ఏం చేయడానికైనా సిద్ధపడతారనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. 

పొద్దున లేస్తే ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్, మరొకటి అంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయించిన చంద్రబాబు ఆధారాలు చూపించగలడా..? చంద్రబాబు పది హత్యలు చేశారు.. లోకేష్‌ పది మానభంగాలు చేశారని నేను కూడా ఆరోపణలు చేస్తాను. ఆరోపణలు చేస్తే సరిపోతుందా..? ఆధారాలు ఉండాలి కదా..? ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు. 

కరోనా నియంత్రణకు సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలను దేశమంతా ఆదర్శంగా తీసుకుంటుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నీచ రాజకీయం చేశారు. దేశ చరిత్రలో 14 నెలల కాలంలో 4 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు రూ.60 వేల కోట్లతో సంక్షేమ ఫలాలు ఇచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రినైనా చూపించండి అని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. 

విశాఖపట్నంలో స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చేస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టాలని జూలై 2న ప్రభుత్వం జీఓ ఇచ్చింది. గవర్నర్‌ మూడు రాజధానులకు రాజముద్ర 31–07–2020న వేశారు. స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు సంబంధించి భూమిపూజ చేస్తే రాజధాని నిర్మాణం మొదలైపోయిందని రకరకాల ప్రచారం చేస్తున్నారు. అన్నం పెట్టిన చేతులను నరికే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు పత్రిక విశాఖలో మొదలైంది. ఈనాడు పత్రికను ఆదరించిన విశాఖపైనే విషం చిమ్ముతూ వార్తలు రాస్తున్నారు’ అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

Back to Top