విశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న వరుస ప్రమాదాల వెనుక కుట్ర కోణం దాగి ఉందన్న తన అనుమానాన్ని చంద్రబాబు పత్రికా ప్రకటన నిజం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరూ.. అంటే భుజాలు తడుముకున్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్ర, కుతంత్రాల మనస్తత్వం కలిగిన వ్యక్తులు వారి ఎదుగుదలకు అడ్డుగా ఉన్న అంశాలను అనేక అస్త్రాలతో అడ్డు తొలగించుకునే కార్యక్రమం చేస్తారని, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అంగీకరించని చంద్రబాబు.. ఎలాగైనా అడ్డుకోవాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు స్పందించిన తీరు కూడా అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉందన్నారు. దీంతో పాటు చంద్రబాబు తోక పత్రికలు ప్రజలను గందరగోళంలోకి నెట్టే వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదా..? అని ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించిన తీరు చూసి ప్రజలంతా ప్రశంసించారన్నారు. సీఎం వైయస్ జగన్ స్పందించిన తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై కమిటీలు వేసి వాస్తవాలు తెలుసుకున్న తరువాత ప్రమాదానికి కారకులైన వారిని జైలుకు పంపించడం జరిగిందని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రోజు అయినా కారకులను అరెస్టు చేశారా...? అని నిలదీశారు. నిన్న విశాఖలో జరిగిన ఘటనను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధిపొందాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. మొసలి కన్నీరు కారుస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో కోటి రూపాయలు ఏం సరిపోతాయని మాట్లాడిన చంద్రబాబు ఈ రోజున ఏం మొహం పెట్టుకొని రూ.కోటి పరిహారం డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కంపెనీ, బాధితుల మధ్య విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ లబ్ధిపొందే కార్యక్రమం చంద్రబాబు చేయడం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.