బాబు దుర్యోధనుడు.. అయ్యన్న దుశ్యాసనుడు

మున్సిపల్‌ మహిళా కమిషనర్‌పై దుర్భాషలాడితే అరెస్టు చేయకూడదా..?

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు

మహిళా భద్రతకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం మాది 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబు దుర్యోధనుడి పాత్రలో అయ్యన్నపాత్రుడి లాంటి దుశ్యాసనులను ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అయ్యన్న పాత్రుడిపై ఎందుకు కేసు నమోదైందనేది అవగాహన ఉండి మాట్లాడుతున్నారా..? అని చంద్రబాబు, లోకేష్‌లను ప్రశ్నించారు. ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీ నేతలను అధికార దర్పం తగ్గలేదని, నర్సీపట్నం మున్సిపల్‌ మహిళా కమిషనర్‌ను ఉద్దేశించి చెప్పిన పనిచేయకపోతే బట్టలు ఊడదీసి నిలబెడతానని మాట్లాడిన అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయకుండా వదిలేయాలా..? అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడి అరెస్టుపై చంద్రబాబు లేఖ రాయడం, ఆయన కొడుకు లోకేష్‌కు యుద్ధరంగమైన ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారన్నారు. మహిళా అధికారిణి పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని మతిభ్రమించి తండ్రీకొడుకులకు వెనకేసుకొస్తున్నారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ నేతలకు తలకెక్కిన అధికార మదం దిగలేదని, అందుకే మహిళలపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆడవారిని కించపరిచేలా మాట్లాడిన వారెవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 

చంద్రబాబు హయాంలో మహిళలపై విపరీతమైన దాడులు జరిగాయని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ గుర్తుచేశారు. రిషితేశ్వరి ఘటన దగ్గర నుంచి మహిళా ఎమ్మార్వో వనజాక్షి వరకు, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెం గ్రామంలో దళిత మహిళను గత టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఆయన కుమారుడు కలిసి వివస్త్రను చేసిన సందర్భాలు కూడా చేశామన్నారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో హస్తం ఉన్న టీడీపీ నేతలను కాపాడేందుకు గతంలో చంద్రబాబు ప్రయత్నాలు చేయడాన్ని చూశామన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజాను ఎదుర్కోలేక పోలీసులతో అక్రమ అరెస్టు చేయించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని ఊర్లు తిప్పి హింసించాడని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన అరాచకాలు అన్నీ చూసి 2014లో 102 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ 2019లో 23 సీట్లకు పడిపోయిందన్నారు. ఇంకా ఇలాంటి ఆలోచనలే ఉంటే రాబోయే ఎన్నికల్లో 23 కూడా దక్కే అవకాశం లేదన్నారు. . 

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కోసం సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మహిళా భద్రత కోసం ఇప్పటికే దిశ యాక్టును తీసుకువచ్చారన్నారు. అదే విధంగా అమ్మఒడి పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు సాయం అందిస్తున్నారని, వచ్చే నెల 8వ తేదీన అక్కచెల్లెమ్మల పేరు మీదనే 30 లక్షల ఇళ్ల పట్టాలు అందించనున్నారని, మహిళల కోసం సున్నా వడ్డీ పథకం, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top