సీఎం వైయ‌స్ జగన్‌కు మెండుగా ప్రజాభిమానం 

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా  వైయ‌స్ జగన్‌ను ఏమీ చేయలేరు

ప్రజల్లో సీఎంకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి త‌ట్టుకోలేక భయంతోనే బాబు, ప‌వ‌న్‌ పొత్తులు

టీడీపీ సభలతో అమాయ‌క ప్రజలు మృతిచెందినా చంద్రబాబుకు సిగ్గురాలేదు 

అన్నమయ్య జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గ‌డికోట‌ శ్రీకాంత్ రెడ్డి

రాయ‌చోటి: ప్రతిపక్షం ప్రతి విష‌యానికి అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తోందని అన్నమయ్య జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అధికారం కోసం ఎంత‌కైనా టీడీపీ  దిగజారుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తెచ్చిన జీవో నంబర్.1 ని చీకటి జీవో అని  టీడీపీ గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. ఆ జీవో అన్ని పార్టీల‌కూ వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. నడిరోడ్లపై సభలు, సమావేశాలు పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉదేశ్యంతో ప్రభుత్వ అనుమతితో ఖాళీ మైదానాలలో, ప్రదేశాలలో సభలు పెట్టుకోమని ప్రభుత్వం చెపుతున్నా, ప్రతిపక్షం అడ్డుగోలుగా మాట్లాడడం దారుణమన్నారు. రాయచోటి లోని జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో కలసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో నిర్వ‌హించారు. 

ఇరుకు సందుల్లో సభలు పెట్టి భారీగా జనం వచ్చినట్లు డ్రోన్ కెమెరాలలో చూపించుకోవడం కోసం కందుకూరులో ఎనిమిది మంది మృతికి కారకులయ్యారన్నారు. ఆ సంఘటన జరిగినా కూడా సభలో మళ్లీ ఐదు నిమిషాల్లో ఇక్కడికే వస్తానని  చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ప్రజల ప్రాణాలు, భావాలను పట్టించుకోనట్లుగా ఉందన్నారు. సభలో ప్రజల  మరణాల పట్ల చంద్రబాబుకు బాధ కలగడం లేదన్నారు. చంద్రబాబుకు ఈ వయస్సులో కూడా పదవీ వ్యామోహం తగ్గడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయక, మ్యానిఫెస్టోను సైతం అంతర్జాలంలో మాయం చేశారన్నారు. అదే వైయ‌స్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను మూడన్నరేళ్ల కాలంలోనే తొంభై ఎనిమిది శాతానికి పైగా నెరవేర్చారన్నారు. ధైర్యంగా ఎన్నికల హామీలను నెరవేర్చిన సీఎం వైయ‌స్‌ జగన్ ను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం మంచి పద్ధతి  కాదని ప్రతిపక్ష పార్టీ నాయకులుకు ఆయన చురకలంటించారు.

సభలు,సమావేశాలలో ప్రమాద సంఘటనలు జరగకుండా చూడాలని అడిగితే కుంభమేళాలులో, రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా  అని చంద్రబాబు మాట్లాడారన్నారు. తనవల్ల చని పోయారన్న బాధ చంద్రబాబులో లేదన్నారు. గౌరవ ప్రతి పక్ష నాయకుడికి గౌరవంగా చెబుతున్నామని, వాళ్ళ హయాంలో ప్రజలకు ఏమి మంచి చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ప్రజలంతా వారి వైపే ఉన్నారని, చంద్రబాబు అండ్ కో మాట్లాడుతున్నారని, 2014 లో కలసి పోటీ చేసారు.. 2019 లో బి పారాలు ఒకరికొకరు ఇచ్చుకున్నారు..2024 లో కలసి పోటీ చేసినా  ఎవ్వరూ భయపడే స్థితిలో లేరన్నారు. సీఎం వైయ‌స్ జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణకు తట్టుకోలేమన్న భయంతోనే పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. మీరందరూ కుమ్మక్కు కావడమే ముఖ్య‌మంత్రి సక్సెస్ అని స్పష్టంగా తెలుస్తోందన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ కు ప్రజాభిమానం మెండుగా ఉందన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కథలు అల్లుతూ, దిగజారుడు వార్తలు రాయిస్తున్నారన్నారు. ఎనభై ఆరు శాతం సీట్లు గెలిచిన సీఎం ను పరుష పదజాలంతో దూషించడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. 

పవన్ కళ్యాణ్ తన ప్రచార వారాహి వాహనంలో ప్రజలకు ఏమి చేస్తారో చెప్పాలని, పదిహేనేళ్ళ పాలనా కాలంలో ప్రజలకు చంద్రబాబు ఏమి చేశారో చెప్పి ప్రజల మన్ననలను పొందాలే కానీ కుట్రలు కుతంత్రాలు చెయ్యకూడదన్నారు. ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ఎం జి ఆర్, ఎన్ టి ఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తరహాలో అధికారం చేపట్టి, ఆదర్శంగా, పారదర్శంకంగా  పాలన సాగిస్తూ  సీఎం వైయ‌స్‌ జగన్  ప్రజాభిమానం చూరగొంటున్నారన్నారు. చంద్రబాబు లా ఒకరినుంచి పార్టీని లాక్కోలేదని, పార్టీ వ్యవస్థాపకుడికి వెన్నుపోటు పొడిచి ఎన్ టి ఆర్ మరణానికి చంద్రబాబు కారకూడన్నారు. గౌరవంగా, సంస్కారంగా మాట్లాడాలని, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రజలు మళ్లీ మిమ్మలను మూలన కూర్చేపెడతారని ఎమ్మెల్యే గ‌డికోట‌ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

Back to Top