పాలన చేతకాదని తీర్మానం చేసి పంపండి

సమస్యలపై ప్రతిపక్షనేతకు లెటర్‌ రాయడం ఏంటీ..?

అధికారంలో ఉంది మీరా..? మేమా..?

వెంటిలేటర్‌పై ఉన్న ప్రజలకు ఇప్పుడు ఆక్సిజన్‌ అందిస్తారా

ఎన్నికలు వస్తున్నాయని, ఏదో చేయబోతున్నట్లు బాబు బిల్డప్‌

వైయస్‌ఆర్‌లా అభివృద్ధి చూపించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా..?

వంగి వంగి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తులేవా..?

రైతు రుణమాఫీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌: అధికారంలో ఉన్న మంత్రులు సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖలు రాయడం ఏంటని, అధికారంలో ఉంది. టీడీపీనా..? లేక వైయస్‌ఆర్‌ సీపీనా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి ఉండి సమస్యలు పరిష్కరించలేని చేతగాని వాళ్లమని కేబినెట్‌లో తీర్మానం చేసి ప్రతిపక్ష నేతలకు ఆ తీర్మానం కాపీని పంపించాలని సూచించారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలుగా ప్రజలను పట్టించుకొని చంద్రబాబు నేడు కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి మేలు చేయబోతున్నామనే బిల్డప్‌ చూస్తే ఆశ్యర్యంగా ఉందన్నారు. వ్యవసాయమే దండగ అనే సిద్ధాంతంతో ఉన్న వ్యక్తి రైతులకు మేలు చేస్తారనే నమ్మకం ఏ కోశాన లేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం అసెంబ్లీకి రావడం లేదని మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. అనైతికంగా ఫిరాయింపు దారులపై వేటు వేస్తే గంటలో అసెంబ్లీలో ఉంటాం.

గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు గోడు వెల్లబోస్తున్నా పట్టించుకోలేదు. వెంటిలేటర్‌పైకి వచ్చిన తరువాత ఆక్సిజన్‌ ఇస్తామంటూ దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు వ్యవహారం ఉంది. రైతు రక్ష పెడతామంటూ లీకులు, గత నాలుగున్నరేళ్లుగా పెన్షన్లపై మాట్లాడకుండా ఇప్పుడేదో పండుగ లాగా చేస్తామని ప్రజలకు నాలుగున్నరేళ్లుగా మేలు చేస్తున్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. నాలుగున్నరేళ్లు పాలన చేసిన చంద్రబాబు అభివృద్ధిని చూపించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా..? ఎన్నికలు ఇంకా రెండు నెలల్లో ఉన్నాయనగా ఇప్పుడు మరోసారి మోసం చేసే ప్రయత్నం. బాబు పాలనలో ప్రజలు ఊపిరాడక వెంటిలేటర్‌పై ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయని రాజకీయ ప్రయోజనాల కోసం ఆక్సిజన్‌ అందిస్తామంటూ మాట్లాడుతున్నారు.  

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ దేశ వ్యాప్తంగా దిక్సూచి అయింది. 108, ఫీజు రియంబర్స్‌మెంట్, ఇరిగేషన్‌ కార్యక్రమాలను ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టే 2009లో అన్ని పార్టీలు ఒకటైనా ఒంటరిగా పోటీ చేసి అభివృద్ధిని చూపించి ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించిన మహానాయకుడు వైయస్‌ఆర్‌. నాలుగున్నరేళ్లు చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి అని ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేశారు. వంచించారు. 

మంత్రులు పదే పదే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు ఉత్తరాలు రాస్తున్నారు. అధికారంలో ఉంది ఎవరనేది మర్చిపోయారా..? దేవినేని ఉమ ఇరిగేషన్‌ సమస్యలు, ప్రాజెక్టులపై లెటర్, మరో మంత్రి రవీంద్ర విద్యార్థుల సమస్యలపై లెటర్‌ రాస్తున్నారు. అధికారంలో ఉంది మీరా..? మేమా..? అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వం అని మర్చిపోయారేమో. సమస్యలను పరిష్కరించుకోలేక విఫలమై ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి పారిపోయి కరకట్టపై చేరి సమస్యలపై ప్రతిపక్ష నాయకుడు పరిష్కరించలేదని చేయలేదని మాట్లాడడం హాస్యాస్పదం. రాగ ద్వేషాలకు అతీతంగా స్వప్రయోజనాలను పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులను పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు ఉమ్మడి రాజధానిలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులను గాలికి వదిలేసి తన కేసులను ఎక్కడ బయటపెడతారోనని కేంద్రానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భయపడి పారిపోయి విజయవాడకు వచ్చాడు. సమస్యలపై వైయస్‌ జగన్‌కు లెటర్‌ రాస్తున్నారంటే వీళ్లు మంత్రులా.. జోకర్ల అనేది అర్థం కావడం లేదు. చంద్రబాబులా లాలూచీ రాజకీయాలు చేయకుండా నిజాయితీతో రాజకీయాలు చేసే వైయస్‌ జగన్‌ జగన్‌ సమస్యలన్నింటినీ చిత్తశుద్ధితో పరిష్కరిస్తారు. 

షెడ్యుల్‌ 9, 10 సమస్యలపై కేంద్రాన్ని ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు. రాజధాని శంకుస్థాపనకు రావాలని కేసీఆర్‌కు వంగి వంగి నమస్కారాలు పెట్టింది మీరు కాదా..? కనకదుర్గ ఆలయానికి వచ్చినప్పుడు కండువాలు కప్పి కాళ్లు మొక్కింది మీరు కాదా..? కేసీఆర్‌ చేపట్టిన యాగాలకు చంద్రబాబు హాజరయ్యారు. అప్పుడు రాష్ట్ర ప్రజల హక్కులు కనిపించలేదా..?  హరికృష్ణ చనిపోయినప్పుడు కేటీఆర్‌తో మనిద్దరం కలిసి ఉందామని మాట్లాడలేదా..? అప్పుడు విభజన సమస్యలు గుర్తుకు రాలేదా..? సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యామని ఒప్పుకొని కాబోయే సీఎం వైయస్‌ జగన్‌ కాబట్టి లెటర్‌ రాస్తున్నారని అనిపిస్తుంది. వైయస్‌ఆర్‌ మరణించిన నాటి నుంచి అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌. ఆరోగ్యశ్రీ, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై జననేత పోరాడారు. ప్రత్యేక హోదా కోసం దేశంలో ఏ నాయకుడు చేయని పోరాటాలు చేశారు. చంద్రబాబు ఏ పోరాటం చేయకుండా భయపడి రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టారు. ధర్మపోరాటం అని వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను బలవంతంగా సభలకు తరలిస్తున్నారు.

వ్యవసాయం దండగ అని చంద్రబాబు పుస్తకం రాసుకున్నాడు. రైతులు నష్టపరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మాట్లాడిన చంద్రబాబు రైతులకు మంచి చేస్తాడా..? గతంలో తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే అవహేళన, అవమానకరంగా మాట్లాడాడు. సంక్షేమాలు అంటే ఎలా అమలు చేయాలో చూపించిన వ్యక్తి వైయస్‌ఆర్‌. రైతులపై ప్రేమ ఉంటే రుణమాఫీ ఎంత చేశావు. కనీసం వడ్డీకయినా సరిపోయిందా..? రైతు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేస్తారా..? రైతులకు 2014 నుంచి రూ. 4,500 కోట్లకుపైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌లు రావాలి. దానిపై ఏమైనా ఆలోచన చేశారా..? రెయిన్‌ గన్లు అంటూ మోసం చేశారు. కరువు తరిమేశానని గోబెల్స్‌ ప్రచారం. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. చంద్రబాబు ఆడే డ్రామాలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దు. 

చంద్రబాబు హయాంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు ఏ ఒక్కరికైనా ఉపయోగం ఉందా..? కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల విషయంపై వెంకయ్యనాయుడును ఎందుకు నిలదీయలేకపోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గట్కరీ, వెంకయ్యనాయుడు ద్వారా మళ్లీ కలవొచ్చని లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారేమో.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారితో కలవడానికి మంతనాలు చేస్తున్నాడు. రెండు పడవల మీద కాళ్లు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. స్వార్థ రాజకీయాల కోసం ఎవరితోనైనా కలుస్తాడు, సిద్ధాంతాలు లేని పార్టీ టీడీపీ. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా ఇంతే. ఎన్టీఆర్‌ మరణించడానికి ముందు ప్రెస్‌తో ఏం మాట్లాడారో చూస్తే తెలుస్తుంది. నాదెండ్ల భాస్కర్‌రావు మాట్లాడిన మాటలను పరిశీలన చేయండి. చంద్రబాబు దగ్గర పనిచేసిన చీఫ్‌ సెక్రటరీలు మాటలు వినండి. ప్రజలంతా ఆలోచన చేయాలి చంద్రబాబు ఏ రకంగా వాడుకుంటాడో ఆలోచించండి. చివరి క్షణాల్లో మాటలు చెప్పే నాయకులు మనకు అవసరం లేదు. చంద్రబాబు లాంటి వ్యక్తులను తరిమికొట్టాలి. 

వంగవీటి రాధా పార్టీ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకర సంఘటన. గతంలో పోటీ చేసిన విజయవాడ ఈస్ట్‌ నుంచి పోటీ చేయాలని చెప్పారు. ఈస్ట్‌లో ఓడిపోతే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని రాధాకు భరోసా ఇచ్చారు. పార్టీలో కొనసాగితే బాగుంటుందని కోరుకుంటున్నాం. వంగవీటి రంగాను దారుణంగా చంపిన టీడీపీలోకి వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీలో చేరడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. 

 

Back to Top