చంద్రబాబుది అంతా కాపీనే

ఫెడరల్‌ ఫ్రంట్‌పై మాత్రమే కేటీఆర్‌తో చర్చించాం
 

పింఛన్‌ పెంచుతామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు
 

వైయస్‌ జగన్‌ నవరత్నాలు కాపీ కొట్టారు

రాహుల్‌ను జోకర్‌ అన్న చంద్రబాబు..ఇప్పుడు చారిత్రక అవసరం అంటున్నారు

ఢిల్లీ వెళ్లి శాలువాలు కప్పుతారు..వీణలు పంచుతారు

రూ.6లక్షల కోట్ల అవినీతిపై ఒక్క సమాధానం చెప్పలేకపోయారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుది అంతా కాపీనే అని, వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సయించి పక్క రాష్ట్రాల్లో నీతులు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. వైయస్‌ జగన్‌–కేటీఆర్‌ భేటీపై టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. మంగళవారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నాదేళ్ల భాస్కర్‌రావు ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు పాలనపై కామెంట్‌ చేశారన్నారు.

‘‘కేబినెట్‌లో జెట్కా బండి తోలే వారు మాత్రమే ఉన్నారు’’ అని నాదేళ్ల పేర్కొన్నట్లు చెప్పారు. జెట్కా బండి నడిపేవారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. దీనిపై  ఇంతవరకు టీడీపీ నేతలు మాట్లాడింది లేదన్నారు. చంద్రబాబు తీరును ఎంత చెప్పినా తక్కువే అన్నారు. గుండమ్మ కథలోని పాట చంద్రబాబు తీరుకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు.  వేషం మార్చాడు, భాషాలు నేర్చారని, కడలిని మించిన ఆశలు దాచేను అన్నట్లుగా పాటలోని ప్రతి పదం చంద్రబాబుకు సరిపోతుందని వివరించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన చంద్రబాబు–గుండమ్మ కథ పాట వాస్తవరూపంలో ఉందన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోరే వారు ఎవరైనా ఫెడరల్‌ ప్రంట్‌ను స్వాగతిస్తారన్నారు. రాష్ట్రాల హక్కుల సాధనకు ఇది సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై మాట్లాడేందుకు కేసీఆర్‌ పలు రాష్ట్రాల నాయకులతో చర్చించారన్నారు.

ఈ క్రమంలోనే తన కుమారుడు కేటీఆర్‌ను వైయస్‌ జగన్‌ వద్దకు పంపించారన్నారు. దీన్ని విఫరీతంగా చిత్రీకరించి తెలంగాణ, ఆంధ్ర, మోసం అంటూ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. ఎవరైనా, ఏ రాష్ట్రమైనా కేంద్రంతో పని చే యించుకునేందుకు ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాల్సిందే అన్నారు. నదీ జలాలు, ఇతర అంశాలపై పక్క రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్లాల్సిందే అన్నారు. రేపు పొద్దున చంద్రబాబు గెలుస్తారన్న నమ్మకం లేదు కాబట్టే ఆయనతో ఎవరు వచ్చి కలవడం లేదన్నారు. వైయస్‌ జగన్‌తో మాట్లాడుతున్నారంటే రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందనే కదా అన్నారు. అవసరమైనప్పుడు సెట్లర్లను వాడుకున్న చంద్రబాబు, అవసరం తీరిన తరువాత సెట్లర్లను విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబు ఆలోచన విధానం ఏంటో చెప్పాలన్నారు. నందమూరి హరికృష్ణ శవం వద్ద కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు ఇవాళ విమర్శించడం దారుణమన్నారు.

తెలంగాణ వాళ్లు తెలుగు వారు కాదా అని నిలదీశారు. చంద్రబాబు కలిస్తే నీతి, వేరే వాళ్లు కలిస్తే తప్పా అని ప్రశ్నించారు. సోనియాను దయ్యం, రాక్షసి అన్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం చారిత్రాత్మక అవసరం అంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి నాడు బీజేపీ నేతలను శాలువాలతో సన్మానించి, పొగడ్తలతో ముంచారన్నారు. మేం మాత్రం కప్పు కాఫీ ఇచ్చి మాట్లాడితే తప్పా అని ధ్వజమెత్తారు.
ప్రత్యేక హోదాకు ఎవరు మద్దతిస్తే వారితో ఉంటామని వైయస్‌ జగన్‌ పేర్కొన్నట్లు బుగ్గన గుర్తు చేశారు. నాడు హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించారని తెలిపారు. హోదా కోసం పోరాటం చేసిన పిల్లలను జైల్లో పెడతామని హెచ్చరించారని చెప్పారు. వైయస్‌ జగన్‌ పగలు పూట పాదయాత్ర చేశారని, చంద్రబాబు ఎప్పుడు నడిచారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌  పాదయాత్రలో ఇచ్చిన హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని తప్పుపట్టారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫి చేస్తామని నాడు మాట ఇచ్చి మోసం చేశారన్నారు.

వైయస్‌ జగన్‌ రైతులకు పెట్టుబడి నిధి ఇస్తామంటే నాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారని ప్రశ్నించిన టీడీపీ నేతలు ఇప్పుడు మేమే ఇస్తామని ప్రకటిస్తున్నారన్నారు. అసెంబ్లీకి రావడం లేదని టీడీపీ నేతలు అంటారు..వస్తే మైక్‌ ఇవ్వకుండా అన్యాయం చేస్తారని వివరించారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు దొంగిలించారని విమర్శించారు. కలకత్తాలో చంద్రబాబు మాట్లాడిన మాటలు విని పక్క రాష్ట్రాల ప్రజలు, నాయకులు నవ్వుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా వ్యవహరించడం తెలుగు జాతికి చెడ్డ పేరు తెస్తుందన్నారు. హైదరాబాద్‌ నేనే కడుతానని, ఒలింపిక్స్‌ అమరావతిలో నిర్వహిస్తామని, నోబుల్‌ ప్రైజ్‌  ఇస్తామని పొంతన లేని మాటలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. 
ప్రతి పోల్‌కు మళ్లీ మీరే రావాలి బాబు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం చూస్తే..అద్దం ఎదుట నిలబడి మళ్లీ మీరే రావాలని మీరే చెప్పుకున్నట్లుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే చాలు ఇవే ప్లెక్సీలు కనిపిస్తున్నాయన్నారు. కేటీఆర్‌ వచ్చి వైయస్‌ జగన్‌తో మాట్లాడితే చాలు ఎన్ని అభాండాలు మాట్లాడారో అని తప్పుపట్టారు. చంద్రబాబు టీఆర్‌ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది వాస్తవం కాదా అని దుయ్యబట్టారు. టీడీపీ మంత్రులు కూడా విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు. పరిపాలన చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రికి చేతకాలేదు..అసమర్ధుడు అని మీరే ఒప్పుకుంటున్నారని, లేదంటే ఎలాగైనా వైయస్‌ జగన్‌ సీఎం అవుతారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించమని కోరుతున్నట్లుగా టీడీపీ మంత్రుల మాటలు ఉన్నాయని చెప్పారు. 

వైయస్‌ షర్మిళ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మీడియా ముందుకు వచ్చి చెబితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తారా అని నిలదీశారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే దాన్ని కోడికత్తి అంటూ హేళన చేశారన్నారు. ఇవాళ వైయస్‌ జగన్‌ అమరావతిలో సొంత  ఇల్లు కట్టుకున్నారని, చంద్రబాబు ఇంతవరకు సొంతంగా  ఇల్లు నిర్మించుకోలేదన్నారు. అక్రమ నిర్మాణంలో సీఎం నివాసం ఉంటున్నారని తప్పుపట్టారు. రూ.6 లక్షల కోట్ల అవినీతిపై చంద్రబాబు పుస్తకం విడుదల చేస్తే టీడీపీ నేతలు పొంతలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. అన్యాయమైన దుష్ప్రచారాన్ని మీడియా ప్రసారం చేయకండి అని విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తిని ఒక్కసారి ఫూల్‌ చేయవచ్చు అని, అందరిని అన్ని సమయాల్లో ఫూల్‌ చేయలేరని అబ్రాహంలింకన్‌ వ్యాఖ్యలను గుర్తు చేశారు. 

 

Back to Top