బీసీలను మోసం చేసిన ఘనత టీడీపీదే...

బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది...

 దగా పడ్డ బీసీలంతా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌..

నెల్లూరు:  బీసీలను 40 సంవత్సరాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుని మోసం చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.నెల్లూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల సమస్యలను, స్థితిగతులను పట్టించుకోలేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రహించి..వారి  అభ్యున్నతికి బీసీ డిక్లరేషన్‌ తీసుకొచ్చారని తెలిపారు.చంద్రబాబు  సంవత్సరానికి 10వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో ప్రవేశపెడతానని  చెప్పి మోసం చేశారన్నారు. ఐదు సంవత్సరాలకు కేవలం 18వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసి బీసీలను మోసం చేశారన్నారు.సబ్‌ప్లాన్‌ అంటూ బీసీలను ఆశపెట్టిన చంద్రబాబు..సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించలేదన్నారు.అధికారంలోకి వచ్చిన మొదట సమావేశాల్లోనే సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని బీసీ గర్జనలో  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారన్నారు. పదివేల కోట్లు అంటూ టీడీపీ మోసం చేసిందని..వైయస్‌ జగన్‌ 15వేల కోట్లు కేటాయించి  బీసీల జీవితాలను మారుస్తారన్నారు. ఐదేళ్లలో 75 వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తామని వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారన్నారు.

బీసీ కులాలకు వేర్వేరుగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు కోరుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో బీసీల సమస్యలు తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లు నిద్రపోయి.. కనీసం ఒక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయకుండా..చిట్టచివరి అసెంబ్లీ సెషన్‌ బడ్జెట్‌లో ఒక రూపాయి కూడా కార్పొరేషన్‌కు పెట్టకుండా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని తూతూమంత్రంగా ప్రకటించారని తెలిపారు. మరోసారి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 139 ఉప కులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టంగా ప్రకటించారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన హయాంలో 40 లక్షలకు మందికిపైగా బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని తెలిపారు. వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల చదువుల కోసం ఎన్ని లక్షలయినా ఖర్చుపెడుతుందని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారని తెలిపారు. నాయీ బ్రాహ్మణల  సెలూన్‌ షాపులకు సంవత్సరానికి 10వేల రూపాయలు ఇస్తామని తెలిపారన్నారు. చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా 10 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారన్నారు.నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు కేటాయిస్తామని తెలిపారన్నారు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల బీసీ మహిళలకు 75 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారన్నారు.తెలుగుదేశం పార్టీ పాలనలో దగా పడిన బీసీలంతా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. 

Back to Top