కృష్ణా: వెధవలంతా ఒకచోట చేరి స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తున్నారని, ప్రజలెవరూ వారిని పట్టించుకోరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానా అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబును సిగ్గు, శరం లేకుండా తమిళనాడు నుంచి వచ్చి రజినీకాంత్ పొగుడుతున్నాడని మండిపడ్డారు. రజినీకాంత్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్‌పై ఆనాడు చెప్పులు విసురుతుండగా చంద్రబాబుకు రజినీకాంత్ మద్దతు తెలిపారని గుర్తుచేశారు. అలాంటి రజినీకాంత్ ఇవాళ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ బతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు..? అసలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు..? అని ప్రశ్నించారు. సినిమా డైలాగ్‌లు సినిమాల్లో చెప్పుకుంటే బాగుంటుందని, అయినా రజినీకాంత్ సినిమాలు కూడా చూసేవాడు ఎవ్వరూ లేరన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీకాంత్ చదివి మరింత దిగజారిపోయాడని కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజినీకాంత్‌ను తమిళనాడు నుంచి చంద్రబాబు పిలిపించాడన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని పవన్ ఇకనైనా గ్రహించాలని, తాను వేసే బిస్కెట్లకు ఎవరైనా వస్తారని చూపించుకునేందుకే తమిళనాడు నుంచి రజినీకాంత్‌ను పిలిపించుకొని చంద్రబాబు పొగిడించుకున్నాడన్నారు.