ముగ్గురు దొంగలు కలిసి ఎవరిపై కుట్ర చేశారు..?

ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ ర‌హ‌స్య భేటీ

చంద్రబాబు డైరెక్షన్‌లోనే గంటన్నరపాటు కుట్రకు పన్నాగం

కమల వనంలో పచ్చ పుష్పాలు సుజనా, కామినేని

బాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కీలుబొమ్మ

నైతిక విలువలుంటే ఎస్‌ఈసీ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలి

నిమ్మగడ్డను తక్షణమే అరెస్టు చేసి విచారణ చేయాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌

తాడేపల్లి: వ్యవస్థలను అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, వ్యవస్థలను అనైతిక చర్యలకు ఉపయోగించుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పుకునే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నాయుడు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాడని విమర్శించారు. వాడుకోవడం, వదిలేయడం, మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం క్లుప్తంగా ఇది చంద్రబాబు రాజకీయ జీవితమన్నారు. హైదరాబాద్‌లోని పార్కు హయత్‌ హోటల్‌లో కమల వనంలో పచ్చ పుష్పాలైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ ఎందుకు భేటీ అయ్యారని, గంటన్నర పాటు ఏ కుట్రకు పన్నాగం పన్నారో చెప్పాలన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తెలుగుదేశం పార్టీ చేతులో కీలుబొమ్మగా తయారు చేసే పరిస్థితికి ఆ సంస్థ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రయత్నం చేసిన వైనాన్ని రాష్ట్ర ప్రజానీకం అంతా చూసిందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలను సరిచేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ల పదవీ కాలాన్నీ ∙మూడేళ్లకు కుదించడం, న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్‌ అయినవారిని మాత్రమే ఈఎస్‌సీగా నియమించాలనే ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 

ఆర్డినెన్స్‌ అమలు చేసే క్రమంలో ఎస్‌ఈసీగా రిటైర్డ్‌ జడ్జి కనగరాజు బాధ్యతలు చేపట్టారన్నారు. మూడేళ్లు తన పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దీన్ని పెద్ద వివాదం చేశారని గుర్తుచేశారు. దీనిపై హైకోర్టులో నిమ్మగడ్డ వేసిన పిటీషన్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు కూడా జాయిన్‌ అయ్యి వాదనలు వినిపించడంతో ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిందన్నారు. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లిందన్నారు. 
 
రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నాడని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకునేలా నేడు కొన్ని వార్తలు బయటకు వచ్చాయన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌ పార్కుహయత్‌ హోటల్‌లో యలమంచలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్‌ను కలవడానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 

సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో రమేష్‌కుమార్‌ గంటన్నర పాటు ఏ అంశంపై, ఎందుకు చర్చించారో.. అసలు ఎందుకు కలిశారో తేలాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడానికి చంద్రబాబుకు అనుకూలంగా రమేష్‌కుమార్‌ కుట్రలు చేస్తున్నాడని తేలిపోయిందన్నారు. ముగ్గురు దొంగలు కలిసి ఎవరిపై కుట్ర చేశారని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉండి తప్పుడు పనులకు తెరతీసిన రమేష్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేసి విచారణ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.  

ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ తరుఫున హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాదించేందుకు హరీష్‌ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదిని నియమించారని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న రమేష్‌కుమార్‌ లాంటి వ్యక్తి హరీష్‌ సాల్వే కి ఫీజు చెల్లించగలడా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు జేబులో డబ్బులు కట్టి ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రమేష్‌కుమార్‌ ఎస్‌ఈసీ ఆ పదవిలో ఉండే అర్హత కోల్పోయాడన్నారు. నైతిక విలువలు ఉంటే తక్షణమే పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top