కోడెలనే పెద్ద గజ దొంగ

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

తాడేపల్లి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పెద్ద గజ దొంగ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ర్పచారం జరుగుతుందని ఖండించారు. పెద్ద దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ పర్నీచర్‌ దొంగతనం చేసి కోడెల కార్యాలయంలో దాచుకున్నారని, శాసన సభకు సంబంధించిన 30 కంప్యూటర్లు కోడెల శివప్రసాదరావు కొడుకు, కూతురు కలిసి అమ్ముకున్నారని ప్రచారం జరుగుతూ తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారికి ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ శ్రీకాంత్‌ ఈ లేఖను గుంటూరు జిల్లాకు చెందిన ఈఎస్సీ కో-ఆర్డినేటర్‌కు విచారణ చేయమని ఆదేశించారన్నారు. ఈ లోగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ పర్సనల్‌గా వచ్చి కోడెల గెస్ట్‌హౌస్‌లో పరిశీలించారన్నారు.

పోయిన 30 కంప్యూటర్లలో 29 కంప్యూటర్లు రాత్రి పది గంటలకే వచ్చాయన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారికి ఆ కంప్యూటర్లు అప్పగించారంటే..కోడెల కుటుంబం కంప్యూటర్లు కాజేసీ..కేసు లేకుండా జాగ్రత్తపడ్డారన్నారు. నిన్న జరిగిన దొంగతనం కోడెల ప్రమేయంతోనే జరిగిందన్నారు. తానేదో కుట్ర చేసి దొంగతనం చేయించినట్లు దుష్ర్పచారం జరుగుతుందన్నారు. ఇది ఒక కంప్యూటర్‌ కొత్త స్కామ్‌గా అభివర్ణించారు.

ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎవరు దొంగలో తేలిపోతారని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్‌ దొరికిపోయిన దొంగ అన్నారు. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, దొంగతనాలు చేయించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కోడెలకు సంబంధించిన హీరో హోండా షోరూమ్‌ను ఆ కంపెనీ సీజ్‌ చేసిందని, అక్కడ అసెంబ్లీ పర్నీచర్‌ ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. షోరూమ్‌ తన క్యాంపు ఆఫీస్‌ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈయనకు మూడు చోట్ల క్యాంపు ఆఫీసులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దుర్మార్గమైన పనులు చేసి ఇవాళ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. 

Back to Top