ఏ మొహం పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారు

గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచి  ప్రజల నడ్డి విరగ్గొట్టింది చంద్రబాబు కాదా..?

పవర్ స్టార్ కేంద్రంపై తన పవర్ ఎందుకు చూపించడు?

ఇంటింటికో కొవ్వొత్తి, అగ్గిపెట్టెతో పాటు పచ్చ జెండా కూడా పంపిస్తే ప్రజలే కాల్చుతారు

పేదల మీద భారం వేయాలంటే సీఎం వైయ‌స్ జగన్ విలవిల్లాడిపోతారు

మూడేళ్ళలో రూ. 1.32 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందాయి

అనివార్యమైన పరిస్థితుల్లోనే స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు.. ప్రజలు అర్థం చేసుకుంటారు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార‌ ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు 

తాడేప‌ల్లి: విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేన‌ని, టీడీపీ హ‌యాంలో ఐదేళ్ల‌లో నాలుగు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేద‌ల న‌డ్డి విర‌గ్గొట్టింది చంద్ర‌బాబు కాదా..? అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. పేద‌ల మీద భారం వేయాలంటే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విల‌విల్లాడిపోతార‌ని, అనివార్య పరిస్థితుల్లోనే స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచామని, దానిని ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటార‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..

ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ,  ప్రభుత్వం తరఫున ప్రజలకు శుభాకాంక్షలు. గత మూడేళ్ళుగా చంద్రబాబుకు షడ్రుచుల ఉగాది పచ్చడిలో చేదు మాత్రమే తగులుతుంది. రేపు వచ్చే ఉగాది, శుభకృతు నామ సంవత్సరం. అంటే మంచి కార్యం అని అర్థం. అలాంటి మంచి నామంతో ఈసారి ఉగాది వస్తోంది. చంద్రబాబు కాలంలో వచ్చిన తెలుగు సంవత్సరాది పేర్లు దుర్ముఖి, వికారి అనే వికారమైన పేర్లతో తెలుగు సంవత్సరాదులు వచ్చాయి. అదే వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లవ నామ సంవత్సరం, శుభకృతు సంవత్సరం రావడం మంచి పరిణామం. 

సీఎం వైయ‌స్ జగన్ పరిపాలనలో గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. ఓవైపు ఆర్బీకేలు, మరోవైపు గ్రామ సచివాలయాలు, మరోపక్కన విలేజ్‌ క్లీనిక్‌లు, నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రులు చక్కగా ముస్తాబు అవుతున్నాయి. ప్రతి అమ్మకి అమ్మ ఒడి, వైయ‌స్సార్‌ ఆసరా, చేయూత, కాపునేస్తం, మత్స్యకార, చేనేత నేస్తం, పెరిగిన పెన్షన్లు సరాసరి ఇంటికే వచ్చి చేరుతున్నాయి. ఇలాంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా పడి, రిజర్వాయర్లు అన్ని నిండాయి. చక్కని వాతావరణం ఏర్పడింది. ఈ మూడేళ్లలో రూ.1.32 ల‌క్ష‌ల కోట్లు డైరెక్ట్‌గా డీబీటీ ద్వారా ప్రజలకు వారి ఖాతాల్లో జ‌మ అయ్యాయి. ఇంకా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, పరిపాలనా వికేంద్రీకరణ, జిల్లాల వికేంద్రీకరణ, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు.. ఇలా వైయ‌స్‌ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త శోభను సంతరించుకుంటోంది. అందుకే టీడీపీ భరించలేకపోతుంది. తమ పార్టీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని చంద్రబాబు, టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. 

అనివార్యమైన పరిస్థితుల్లోనే..
స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచం, దేశవ్యాప్తంగా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఆదాయాలు పడిపోయాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతోంది. దీనివల్ల బొగ్గు రేట్లు, రవాణా చార్జీలు పెరిగిపోయాయి. తెలంగాణాలో మాదిరిగా మనకేమీ సొంత బొగ్గు గనులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా స‍్వల్పంగా చార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.  తప్పలేదు. దాన్ని ప్రజలు గమనిస్తారు, ఆలోచిస్తారని అని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ వాస్తవాలను పక్కనపెట్టి, చంద్రబాబునాయుడు అండ్ కో, ఎల్లో మీడియా ప్రజలకు అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తున్నారు. రూ. 1400 కోట్లు మాత్రమే విద్యుత్‌ ఛార్జీల భారం వేయాల్సిన పరిస్థితులు వస్తే.. రూ.42వేల కోట్లు ప్రజలపై భారం వేశారని ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, మనతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచింది. మనం రూ. 1400 కోట్లు పెంచితే.. తెలంగాణ ప్రభుత్వం రూ. 5,596 కోట్లు పెంచేశారు. తెలంగాణలో 300యూనిట్లు దాటితే యూనిట్‌కు 9రూపాయిలు పెంచితే, మన రాష్ట్రంలో రూ 8.75పైసలు పెంచాం, అంటే తెలంగాణ కన్నా మన రాష్ట్రంలోనే తక్కువ చార్జీలు ఉన్నాయి.  

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విద్యుత్‌ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే.. మన రాష్ట్రంలోనే చాలా తక్కువగా విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.  ఈ రాష్ట్రంలో 100 యూనిట్లను తీసుకుంటే.. ఆ పరిధికి లోబడిన వారి సంఖ్య 70శాతం ఉంటుంది.  వారందరినీ దృష్టిలో పెట్టుకుని చార్జీలు స్వల్పంగా మాత్రమే పెంచిన ప్రభుత్వం మాది. దీన్ని గోరంతలు కొండంతలుగా చేసి, టీడీపీ, ఎల్లో మీడియా కలిసి ప్రజలను గందరగోళం చేస్తున్నారు. 

పెట్రో, గ్యాస్ ధరలు పెరిగితే కేంద్రాన్ని ప్రశ్నించాలంటే భయమా..?
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. గత పదిరోజుల్లో 9సార్లు డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచారు. గ్యాస్‌ ఎవరు పెంచారు? పెట్రోలు, డీజిల్ ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఎవరు? దీనికి కారణం సీఎం వైయ‌స్ జగన్‌ కాదే? చంద్రబాబు అబ్బాయ్‌ పగలే లాంతరు పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి సిలిండర్‌ ధరలు పెరిగాయి కదా? గ్యాస్‌ బండ పట్టుకుని తిరగవేం? 10 రోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగితే మాట్లాడవేం? కేంద్రంపై మాట్లాడాలంటే మీకు భయమా? 

ఇక భారతీయ జనతా పార్టీ వాళ్లు విద్యుత్‌ చార్జీల పెంపును తాము ఒప్పుకునేది లేదంటున్నారు? మీరు పెంచే పెంపులు సంగతేంటి? కారు ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకు రమ్మని ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చి పంపిస్తే.. పెట్రోలు బంక్‌కు వెళ్లేలోపే ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అనూహ్యంగా పెంచేస్తున్నారే? ఎంతకాలం నుంచి మీరు భారాలు మోపుతున్నారు? దానిని ప్రజలు అంగీకరించాలా? అదే మేము అనివార్యమైన పరిస్థితుల్లో, కరెంట్‌ చార్జీలు స్వల్పంగా పెంచితే మేము ఒప్పుకునేది లేదంటారా..?, ఇదెక్కడి న్యాయం. బీజేపీ వాళ్లే కాదు వారికి అండగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి పవర్‌ ఇవ్వండి నా పవర్‌ చూపిస్తానంటున్న పవన్‌ కల్యాణ్‌.. మరి మీ పవరేంటో కేంద్ర ప్రభుత్వంపై చూపించరా, మీరు పవర్‌ స్టార్‌ కదా?. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచితే కేంద్ర ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడవేం? అది ప్రజలకు భారం కాదా? వీటి గురించి పవన్‌ మాట్లాడడు, తెలుగుదేశం మాట్లాడదు. బీజేపీ మాట్లాడదు. అదే సీఎం వైయ‌స్ జగన్ అనివార్యమైన పరిస్థితుల్లో స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచితే దానిమీద గందరగోళం చేసే పరిస్థితి తీసుకువస్తున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఎవరు? మీరు కాదా..?

విద్యుత్‌ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా..?
విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేసిన చంద్రబాబు, ఆ రంగంపై రూ. 68వేల కోట్లు అప్పు చేశాడు. డిస్కమ్‌ల మీద రూ. 21వేల కోట్లు అప్పులను తెలుగుదేశం ప్రభుత్వం మాకు అప్పచెప్పి వెళ్లింది.  ఆ అప్పులను తీర్చడంతో పాటు డిస్కమ్‌లను నడిపించే బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు స్వల్పంగా పెంచింది. చంద్రబాబు నాయుడు సౌర విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి పీపీఏలు చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌ లో యూనిట్ ధర రూ.2.49పైసలు ఉంటే, వారితో లాలూచీ పడి, కిక్ బ్యాగ్స్ పుచ్చుకుని రూ.4.84 పైసలు చొప్పున 25ఏళ్లకు అగ్రిమెంట్‌ చేసుకుని వారి దగ్గర (కిడ్‌బ్యాక్స్‌) తీసుకుని విద్యుత్‌ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా? దీనికి సమాధానం చెప్పండి మరి. మా ప్రభుత్వం ఒకసారి స్వల్పంగా రూ.1400కోట్లు పెంచేటప్పుటికి మీరంతా గందరగోళం చేసేస్తున్నారే. అదే మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నాలుగుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. 800 కోట్లు ఒకసారి, 745కోట్లు, 242కోట్లు ఒకసారి విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. విద్యుత్‌ ఛార్జీల పెంపుకు సంబంధించి టీడీపీ అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉంది?

కొవ్వొత్తి, అగ్గిపెట్టతోపాటు పచ్చజెండా కూడా పంపిస్తే..
విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా వారంరోజుల పాటు కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిస్తారట. శెభాష్‌ పంపించండి. కొవ్వొత్తి, అగ్గిపెట్టెతో పాటు ఒక పచ్చజెండా కూడా పంపించండి. మీరు పంపిన అగ్గిపుల్లతో కొవ్వొత్తి వెలిగించి పైన పచ్చజెండా పెట్టి శుభ్రంగా కాల్చి బూడిద చేసి పంపిస్తారు మీకు. ఇంకా టీడీపీ ఎక్కడుంది..? తెలుగుదేశం పార్టీ దుకాణం ఖాళీ అయిపోయింది. ప్రజలు మీ పక్షాన లేదు. ఒకసారి పంపించి చూడండి. 

గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు మూడుసార్లు కరెంటు చార్జీలు - ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ప్రతి దానికి పక్క రాష్ట్రం, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుతున్నారే.. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఢిల్లీ, కేరళ, మేఘాలయాలో విద్యుత్‌ టారిఫ్‌లు ఎంత ఉన్నాయి? ఇక్కడ ఎలా ఉన్నాయో పోల్చి చూడండి. చాలా రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ లో చార్జీలు తక్కువగా ఉన్నాయి. 

పేదలపక్షపాతి ప్రభుత్వం
వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోంది. మా ప్రభుత్వం పేదల పక్షాన ఉన్న ప్రభుత్వం. పేదల మీద భారం వెయ్యాలంటే సీఎం వైయ‌స్ జగన్ విలవిలలాడిపోతారు. మా ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అలాంటిది పేదల మీద భారం వేయాలంటే వైయ‌స్ జగన్‌కి మనసు ఒప్పదు. కానీ అనివార్యం అయినప్పుడు స్వల్పంగా పెంచడం తప్ప మార్గం లేదు. దానికే చార్జీలు పెంచేశారంటూ గందరగోళం చేసేవాళ్లు.. గతంలో విపరీతంగా చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరగకొట్టినవాళ్లు, ఇప్పుడు కూడా విరగ్గొడుతున్నవాళ్లు.. మా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 

ఏ మొహం పెట్టుకుని ఉద్యమాలు.. 
మా ప్రభుత్వం సామాన్యుడికి రక్షణగా ఉండే ప్రభుత్వం. మీరు ఎన్ని గందరగోళాలు, కేకలు వేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా ఉద్యమాలు చేస్తారా, ముగ్గురూ కలిసి చేస్తారా అనేది మేమూ చూస్తాం. వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారు. కేంద్రంలో పరిపాలన చేస్తున్నవాళ్లు ఒకరు, రాష్ట్రంలో పరిపాలన చేసి ప్రజలపై పెనుభారాలు మోపి, తీవ్ర నష్టం చేసినవాళ్లు మరొకరు.. మీ ఇద్దరూ.. మా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు వీరికి లేదని స్పష్టం చేస్తున్నాం.

తాజా వీడియోలు

Back to Top