‘మీవాడు ముఖ్యమంత్రి‘ కాకపోతే.. ఇంత ఫ్రస్ట్రేషనా..?

రాష్ట్రం బాగుపడుతుంటే చంద్రబాబు అండ్‌ కో.. కి నిద్రపట్టడం లేదా..?

ప్రభుత్వ స్కూళ్ల పదేళ్ల దుస్థితికి సైకిల్‌ కాంగ్రెస్‌ కారణం కాదా..?

చేతనైతే వాస్తవాలు రాసి, ప్రజల మన్ననలను పొందండి..

సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మక చర్యలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది

నాడు–నేడు ద్వారా కార్పొరేట్‌ కు దీటుగా సర్కారీ స్కూళ్ల అభివృద్ధి 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వ మంచి.. చంద్రబాబు పాలనలో చెడు ఎల్లోమీడియాకు కనిపించవా..? 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)

తాడేపల్లి: ‘మనోడు ముఖ్యమంత్రి‘ కాలేదన్న బాధతో అబద్ధాలు, అసత్యాలతో కూడిన వార్తలను ఎల్లో మీడియా రోజూ వండివారుస్తూ ప్రభుత్వంపై పనిగట్టుకుని బురదజల్లుతుందని, వారి రాతలకు, కుట్రలకు హద్దూపద్దూ లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. తమవాడు సీఎం కాకపోతే ఎల్లో మీడియా ఫ్రస్ట్రేషన్‌ ఇంత పీక్‌ స్థాయిలో ఉంటుందా.. అన్నట్లుగా సిగ్గూఎగ్గూ లేకుండా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పైనా ఒక పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనలో జరుగుతోన్న మంచి– చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన చెడు ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించటం లేదని ఆర్కే సూటిగా ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన 26 నెలల కాలంలోనే రూ. 1.40 లక్షల కోట్లు, ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తే వీరికి ఎందుకు ఇంత కక్ష అని నిలదీశారు. పేదవాడు బాగుపడితే, రైతు బాగుపడితే.. తద్వారా రాష్ట్రం బాగుపడితే... చంద్రబాబు అండ్‌ కో కి నిద్రపట్టదా అని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యే ఆర్కే ఇంకా ఏమన్నారంటే..
‘ సీఎం ఇంటి పక్కనే ఇలా..‘ అంటూ ఈనాడు పత్రికలో తాడేపల్లిలో రెండు స్కూళ్ల ఫోటోలు వేసి ఓ వార్త రాశారు. ఈనాడులో వచ్చిన ఈ వార్తను చూస్తే ఏం అర్థమవుతుందంటే.. తెలుగుదేశం హయాంలో బడుల్లో కనీసం బెంచీలు, కుర్చీలూ, టేబుళ్లు, బ్లాక్‌ బోర్డులు కూడా లేకుండా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అన్నదానికి ఈనాడు వార్త అద్దంపడుతోంది. పదేళ్ల సైకిల్‌ కాంగ్రెస్‌ పాలనలో నాశనమైన గవర్నమెంటు బడులకు ఇది నిదర్శనం. 

మరోవైపు సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ఇలాంటి స్కూళ్లకు ఎలా మోక్షం వస్తుందో కూడా అందరికీ అర్థమవుతుంది. రాష్ట్రంలో పేదరికం అన్నది ఉండకూడదు, పేదరికం శాశ్వతంగా పోవాలి అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క సర్కారు బడినీ కార్పొరేట్‌ స్కూల్‌ కు దీటుగా మారుస్తున్నారు. పేదవాడికి విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలని కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి  పనిచేస్తుంటే.. ఎల్లో మీడియా ఎంత నీచంగా ప్రభుత్వంపైన బురదజల్లుతున్నారనడానికి ఈనాడు వార్తను చూస్తే అర్థమవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 57 వేల ప్రభుత్వ బడులను మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో దాదాపు రూ. 3700 కోట్లు ఖర్చు చేసి 15,715 పాఠశాలను అభివృద్ధి చేశారు. ఫేజ్‌– 1 కింద ఒక్క మంగళగిరి నియోజవర్గంలోనే రూ. 13 కోట్లు వెచ్చించి స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. రెండోదశ పనులకూ శ్రీకారం చుట్టారు. స్కూళ్ల అభివృద్ధికి ఏకంగా రూ. 16 నుంచి 17 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈరోజు సర్కారీ బడులకు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టి, విద్యార్థులు క్యూ కట్టే పరిస్థితి వచ్చిదంటే... ఇది అభివృద్ధిలా కనిపించటందా..? ప్రభుత్వ స్కూళ్లల్లో 37.20 నుంచి 43.43 లక్షల మంది వరకు ప్రభుత్వ స్కూళ్లలో రోలింగ్‌ పెరిగితే.. . ఈ పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు రాయడం అన్యాయం. సీఎం వైయస్‌ జగన్‌ వేనోళ్ళ పొగుడూ ఉంటే.. రాసే ముందు కనీసం విచక్షణ లేకుండా రాయడం దుర్మార్గం. 

ఈనాడులో ఏ ఫోటోలు పెట్టి రాశారో.. ఆ దుస్థితికి చంద్రబాబు కారణం కాదా..? 
– 1 నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య 2018–19తో పోలిస్తే.. ప్రైవేటు, గవర్నమెంటు స్కూళ్ళల్లో మొత్తం ఎన్‌రోల్‌మెంటు కలిపి 70.43 లక్షల నుంచి 73.05 లక్షలకు పెరిగింది. ఒక్క ప్రభుత్వ బడులనే తీసుకుంటే.. ఈ కాలంలోనే ఎన్‌రోల్‌మెంటు 37.20 లక్షల నుంచి 43.43 లక్షలకు పెరిగింది. 
– వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లిలోనూ, ప్రతి బిడ్డలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. బహుశా తమ కార్పొరేట్‌ స్కూళ్ళ బేరాల కోసమే ఈ పద్ధతిలో ఎల్లో మీడియా వార్తలు రాస్తుందా..?

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడుస్తూ.. ఒకవైపు సామాజిక విప్లవం మరోవైపు శాశ్వత అభివృద్ధికి అడుగులు వేస్తుంటే.. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఇంత గొప్పగా పనిచేస్తుంటే.. ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవు ఎందుకు..?
–  5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌..  ఇదే తాడేపల్లిలో ఓ ఇంటిని ఆక్రమించుకుని అక్రమ కట్టడంలో ఉంటూ.. ఏనాడైనా కారులో నుంచి కిందకు ఒక్క అడుగు వేసి.. ఈ స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా చూశారా..?, ఎందుకు చూడలేదు?

అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక, సంపూర్ణ పోషణ నుంచి గోరు ముద్ద వరకు ఒకవైపు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మరోవైపు విద్యార్థుల జీవితాలను మార్చేందుకు, భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా, 30–40 ఏళ్ళపాటు గుర్తుండిపోయే విధంగా స్కూళ్ళను అభివృద్ధి చేస్తుంటే.. వాస్తవాలు రాయాలని ఈనాడుకు ఎందుకు అనిపించలేదు..? కనీసం సూచనలు, సలహాలు ఇస్తూ అన్నా రాశారా.. అంటే అదీ లేదు. జగన్‌ గారు చేస్తున్న మంచి పనుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తున్నారు. 

చంద్రబాబు ఊళ్ళో.. నారావారిపల్లె పక్కనే చంద్రబాబు చదువుకున్న స్కూలు శిథాలావస్థకు చేరితే దాన్ని వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక బాగు చేస్తే తప్పితే... బాగుపడలేదు. ఇవి ఈనాడుకు, మిగతా ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించవు..? వైయస్‌ జగన్‌ చేసే మంచి పనులను చూసి ఓర్వలేక, ప్రజలకు మంచి జరగకూడదన్నట్టు రాతలు రాస్తున్నారు. 

మరోవైపు ‘రైతుల గుండెల్లో మీటర్ల మోత..‘అంటూ మరో కథనాన్ని రాశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా,  కరెంటు బకాయిలు కట్టలేదని, రైతులపై నిర్దాక్షిణ్యంగా అక్రమ కేసులు పెట్టి, స్పెషల్‌ పోలీస్‌ స్టేషన్లు, స్పెషల్‌ కోర్టులు పెట్టి వేధించినప్పుడు ఒక్క వార్త అయినా రామోజీ రాశాడా..?
– వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని మహానేత వైయస్‌ఆర్‌ అంటే... ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరావు అని చంద్రబాబు అన్నప్పుడు ఎందుకు రాయలేదు?

రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ను, పగటి పూటే 9 గంటలు ఇస్తుంటే గుండెల్లో మీటర్లు అని రాస్తారా..? ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు మరింత మెరుగైన విధానంలో విద్యుత్‌ పంపిణీ చేసేందుకు మీటర్లు పెడుతున్నారు, దీనివల్ల ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు. ఉచితంగా పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ ను వ్యవసాయానికి అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏకైక లక్ష్యం. 

రాష్ట్రంలోని ప్రతి పొలంలోని ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్తు వస్తోందా లేదా అన్నది తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నాం.
లో వోల్టేజీ– హై వోల్టేజీతో మోటార్లు కాలిపోకుండా ఉపయోగపడేందుకు, ఫీడర్లు, లోడ్‌ సరి చూసుకునేందుకే పెడుతున్నాం. 
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు ఒక్క రూపాయి కూడా రైతులు కట్టనక్కరలేదు
అధికారుల్ని ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయించేందుకు.. లోపాలంటే వారి ద్వారా సరిదిద్దేందుకు మీటర్లు పెడుతున్నాం.. అని ఈనాడు మొదటి పేజీలోనే ప్రభుత్వం ఇంత స్పష్టంగా ప్రకటన ఇచ్చింది. అయినా ఎందుకు వక్రీకరిస్తున్నారో ప్రజలకు బాగా అర్థమవుతుంది. రైతుకు మంచి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చూస్తుంటే.. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తారా రామోజీ..?

పేద విద్యార్థుల కోసం, పేదల కోసం, రైతన్న కోసం.. వైయస్‌ జగన్‌ ఇంత చేస్తున్నా తెలుగుదేశం, ఆ పార్టీకి వత్తాసుపలికే మీడియాకు తక్కువగానే కనిపిస్తుంది. వారి  పదేళ్ళ పాలనలో తెలుగు కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు రైతులకు ఏ ఒక్క మేలు చేయలేదు. 9 గంటల ఉచితమైన నాణ్యమైన విద్యుత్‌ ఇస్తుంటే, రైతన్నలకోసం కనీవినీ ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. మీకు ఎందుకు నచ్చటం లేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టకూడదని, స్టేట్‌ డెవలప్‌ మెంటు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కు బ్యాంకుల నుంచి రుణాలు రాకూడదనే దురుద్దేశంతో నళినీ కుమార్‌ అనే ఈనాడు అడ్వకేట్‌ తో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో పిటిషన్‌ వేయించింది ఈనాడు రామోజీ, చంద్రబాబులు కాదా..?

చంద్రబాబు నాయుడు వల్ల ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, రాష్ట్రం అప్పులపాలైంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కేంద్రంలో భాగస్వాములై ఉండి కూడా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవేవీ తీసుకురాకపోగా, లక్షన్నర కోట్లు అప్పులు చేసి, అవన్నీ తన కాంట్రాక్టర్లకు, బినామీలకు దోచి పెట్టారు.
– ఈరోజు పేదలకోసం, కులాలు, రాజకీయాలు చూడకుండా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  సంక్షేమ పాలన అందిస్తుంటే.. మెచ్చుకోవాల్సిందిపోయి, మా మనిషి కాదు, మా బంధువు కాదు అని మీరు అనుకుని అడ్డగోలు రాతలు రాస్తారా..?
–బాధ్యతగల స్థానంలో ఉండి ప్రభుత్వానికి వీలైతే సూచనలు, సలహాలు ఇవ్వకపోగా, కేసులు వేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా..?
– గతంలో చంద్రబాబు లక్షన్నర కోట్లు అప్పు తెచ్చి జవాబు చెప్పకుండా దోచుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఈరోజు రూ. 1.40 లక్షల కోట్లు.. సంక్షేమ కార్యక్రమాల ద్వారా డీబీటీ విధానంలో ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి అందే విధంగా చూస్తున్నారు. 
– ఇటువంటి రాతల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకు పెన్షన్, రేషన్, ఇళ్ళు వద్దని ఈనాడు రామోజీ ద్వారా చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు. 

నాడు ఎన్టీఆర్‌ పై కుట్రకు ఇదే ఈనాడు రామోజీ, ఎల్లో మీడియా ఎటువంటి పాడు బుద్ధిని వాడారో.. ఈరోజు కూడా అదే పాడు బుద్ధిని వాడుతున్నారు. రామోజీకి వయసు పెరిగింది కానీ, బుద్ధీ, జ్ఞానం పెరగలేదు. ఈ వయసులోనూ ఇటువంటి కుట్రలు చేయడానికి రామోజీకి సిగ్గు ఎక్కడలేదు. చంద్రబాబు పక్కన కూర్చుని మీ చేత ఇటువంటి రాతలు రాయిస్తున్నాడా..? ఇంత అన్యాయంగా, దారుణంగా రాతలు రాస్తారా.? మీ రాతల్లో, చేష్టల్లో.. మీవాడు.. మనోడు సీఎం కాలేదన్న బాధే కనిపిస్తుంది. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఊరుకోరు. చేతనైతే వాస్తవాలు రాయండి, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సూచనలు, సలహాలు ఇవ్వండి. పేపర్‌ ఉంది కదా.. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తాను అనుకుంటే.. వాటిని నమ్మటానికి ఇవి పాత రోజులు కాదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు.  ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక, భరించలేకపోతున్నారా..? మీకెందుకు అంత ఫ్రస్ట్రేషన్‌..?. చేతనైతే వాస్తవాలు రాసి, ప్రజల మన్ననలను పొందండి.. అని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను.

ఇటీవల కాలంలో మరో కుట్రకు బరితెగించారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే మాటలను కట్‌ అండ్‌ పేస్ట్‌ చేసి, మిమిక్రీ ఆర్టిస్టులతో రికార్డు చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కొందరు చూస్తున్నారు. 
– అధికారమే పరమావధిగా గత ఎన్నికల్లో చంద్రబాబు, ఎల్లో మీడియా పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు, కొంతమంది యువకులకు జీతాలు ఇచ్చి మరీ,  లేనివి ఉన్నట్టు సోషల్‌ మీడియా ద్వారా అభూతకల్పనలు సృష్టిస్తున్నారు. ఏ మహిళ కూడా బజారున పడి తన పరువు తీసుకోవాలని చూడదు. మీ కుట్రల అంకంలో ఇదే చిట్ట చివరి మెట్టు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు.. ఇప్పటికైనా మారండి అని హెచ్చరిస్తున్నాం. 
 

Back to Top