దళితులను బెదిరించి భూములను లాక్కున్నారు 

వీడియో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి

భూకుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు అంతా బయటకు రావాల్సిందే

అమరావతిలో చంద్రబాబు, నారాయణ, పుల్లారావులు వేలకోట్ల స్కాంకు పాల్పడ్డారు

ల్యాండ్ స్కాంకు మాస్టర్‌ బ్రెయిన్‌ మాజీ ఐఏఎస్‌ సాంబశివరావు, పాత్రధారులు కోన శశిధర్, కాంతీలాల్ దండే, చెరుకూరి శ్రీధర్

భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి ఎవరో సీఐడీ లోతుగా దర్యాపు చేయాలి

అమరావతి దళితుల భూములను తిరిగి దళితులకే ఇప్పించాలి 

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కు ఎమ్మెల్యే ఆర్కే విజ్ఞప్తి

తాడేప‌ల్లి: అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు అండ్ కో భూకుంభ‌కోణాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి సాక్ష్యాధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు కొంతమంది ఐఏఎస్ అధికారులను అడ్డు పెట్టుకుని దళితులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి కారుచౌకగా కొట్టేశార‌ని, వారి మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని వీడియా సాక్ష్యాధారాలతో సహా బ‌య‌ట‌పెట్టారు. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే అసైన్డ్‌ భూముల జాబితాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లో పెట్టారని, టీడీపీ పెద్దలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కలిసి దళితుల అసైన్డ్‌ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, తమ మనుషులకు కట్టబెట్టడం ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ భూములన్నీ టీడీపీ పెద్దలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇందుకు  చంద్రబాబు హయాంలో పనిచేసిన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారని, భూముల రికార్డులను కూడా మార్చేశారని ఆరోపించారు. 

తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దళితులతో అసైన్డ్ భూములకు సంబంధించిన లావాదేవీలు నెరుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి వీడియో సంభాషణల క్లిప్‌లను మీడియా ముందు ఆర్కే ప్రదర్శించారు. ఈ సాక్ష్యాధారాలను సీఐడీ అధికారులకు ఇచ్చి, అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని కోరనున్నట్టు ఆర్కే తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన అమరావతి భూ కుంభకోణానికి మాస్టర్ బ్రెయిన్ మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు అని, ఇందుకు అప్పుడు గుంటూరు, సీఆర్డీఏలో పనిచేసిన ఐఏఎస్ లు కోన శశిధర్, కాంతీలాల్ దండే, చెరుకూరి శ్రీధర్, కొంతమంది రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించారని ఆర్కే ఆరోపించారు. 

ఇంకా ఏం మాట్లాడారంటే.. 

అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణం జరిగిందని నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అంతకు ముందు నా నియోజకవర్గంలోని కొంతమంది దళిత సోదరులు తమకు అన్యాయం జరిగిందంటూ నాకు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా నేను సీఐడీ అధికారులను ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు, అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొంతమంది అధికారులు కలిసి దళిత సోదరులను భయపెట్టి, బెదిరించి, మోసం చేసి అన్యాయంగా వారి భూములను లాక్కున్నారని అప్పట్లోనే వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. 

2014 చివరలో సీఆర్‌డీఏ చట్టం తీసుకువచ్చి, చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు స్థానికంగా ఉండే కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను ప్రోత్సహించి, దళిత సోదరులను ఏవిధంగా భయపెట్టి, బెదిరించారనేది సాక్ష్యాధారాలతో వీడియోల ద్వారా బయటకు వచ్చాయి. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో ఎంత పెద్ద కుంభకోణం చేశారో ప్రజలు గమనించాలని మీడియా ద్వారా కోరుతున్నాను.

మంగళగిరికి చెందిన కొమ్మారెడ్డి(భూమిపుత్ర) బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు, అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, స్థానిక టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు ఇలాంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను కొంతమందిని పిలిచి ఫలాన విషయం అని చెప్పకుండా.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉన్నఅసైన్డ్‌ ల్యాండ్ వివరాలు మీకు ఇస్తాం. మీరు ఆ రైతులను పిలిచి.. ‘అయ్యా మీ భూములను కొనే పార్టీని తీసుకువస్తాను. మీరు అమ్మకపోతే ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది. మీకు ఎలాంటి ప్యాకేజీ రాదు. ఇప్పుడు అమ్మకపోతే అసలుకే నష్టపోతారు.’ అంటూ ఇలాంటి విష ప్రచారాన్ని బ్రహ్మానందరెడ్డితో పాటు మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రజల్లోకి తీసుకు వెళ్లడం జరిగింది.

వాళ్ళంతా పేద దళితులు.. వ్యవసాయం చేసుకోవడం తప్ప ఏమీ తెలియదు. టీడీపీ పెద్దల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన మాటలకు భయపడిపోయి అతి తక్కువ రేటుకు అసైన్డ్ భూములను తెగనమ్మారు.  ఫలానా సాంబశివరావుకు నీ భూముని అమ్ముతున్నావు. ఇక ఎటువంటి ప్యాకేజీలకు సంబంధం లేదని, డబ్బులు ముట్టినట్లు బాండ్‌ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులే కట్టలు కట్టలు డబ్బులు తీసుకుని వెళ్లి ఇవ్వడం కూడా చాలా క్లియర్‌గా ఆ వీడియోలలో కనిపిస్తోంది. అసలు దళిత సోదరుల భూములు కొనడానికి బ్రహ్మానందరెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు అండ లేకుండా అతను ఇంత ధైర్యంగా ఈ పని చేయగలడా?

చంద్రబాబు నాయుడుకి రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో  ముందుగానే తెలుసు కాబట్టే... ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడ్డం పెట్టుకుని దళిత సోదరుల భూములను లాక్కుని, అవన్నీ చంద్రబాబు బినామీలకు ట్రాన్స్‌ఫర్‌ చేసిన తర్వాతే అప్పుడు ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇది చాలా లోతైన విషయం. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో దళితులు అన్నవారు ఎవరూ ఉండకూడదు అన్నదే చంద్రబాబు అండ్ కో దురాలోచన. చట్టంలో దళితుల భూములను కొనుగోలు చేయకూడదని స్పష్టంగా ఉన్నా.. అవి లాక్కుని ప్యాకేజీలు మాత్రం తన మనుషులకు చెందేలా స్కెచ్ వేశారు. దళితుల భూములతో లావాదేవీలు జరిపిన బ్రహ్మానందరెడ్డి లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎంతోమంది ఉన్నారు. ఈ వీడియోను సీఐడీకి ఇచ్చి ఈ బ్రహ్మానందరెడ్డి, ఇలాంటి మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారులను లోతుగా విచారించి అరెస్ట్‌ చేయాలని మీడియా ముఖంగా సీఐడీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ భూములను లాక్కోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురాదలచుకున్నాను. గతంలో టీటీడీ ఈవోగా కూడా పనిచేసిన, ప్రస్తుత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సాంబశివరావే ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. ఫలానా ప్రాంతంలో రాజధాని పెట్టబోతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు మొట్ట మొదట చెప్పింది కూడా ఆ అధికారికే అనేది నాకు ఉన్న సమాచారం. చంద్రబాబునాయుడు, ప్రస్తుత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సాంబశివరావు సహకారంతో దళితుల భూములను తక్కువ ధరకు కొట్టేసేవిధంగా, తమకు కావాల్సిన వాళ్ళకు కట్టబెట్టేందుకు భారీ స్కెచ్ వేసి, అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆయా గ్రామాలకు చెందిన రెవెన్యూ రికార్డులన్నింటినీ అనధికారికంగా, దొంగతనంగా తరలించారు. అప్పటి గుంటూరు జిల్లా ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, కాంతీలాల్ దండేల సహకారంతో ఈ భూములన్నింటినీ తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. 

అమరావతి రాజధానిలో దళితులను భయ పెట్టి, వారి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములకు ఎటువంటి ప్యాకేజీ రాదని అపోహలు సృష్టించి..  సుమారు నాలుగైదు వేల ఎకరాల భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను అడ్డం పెట్టుకుని అప్పటి ప్రభుత్వలోని పెద్దలు కొట్టేశారు. దళితుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాత అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించినట్టు డ్రామాలు ఆడి, ఆ ప్యాకేజీ వచ్చే సమయంలో దళితులు మాట్లాడకుండా, వారి నొక్కేందుకు ముందుగానే వాళ్ళతో బాండు పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవడం ఓ కుట్ర. అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి. వాటికి లేనంటువంటి రికార్డులు మళ్లీ సృష్టించి, ఆ రికార్డుల అన్నింటిని చంద్రబాబు చెప్పిన పేర్లుపై మార్పించి.. వాటికి ప్యాకేజీ వచ్చేలా చేయించుకుని తమకు కావాల్సిన మనుషులకు వేల కోట్లల్లో లబ్ధి చేకూర్చుకున్నారు. 

ఈ కుంభకోణానికి  సహకరించిన వ్యక్తులెవరో, రెవెన్యూ అధికారులు ఎవరో.. సీఐడీ అధికారులు లోతైన విచారణ చేయాలని కోరుతున్నాను. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పుణ్యాన రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్ లు అయిన కోన శశిధర్, కాంతీలాల్ దండేల్లాంటి అధికారులు కూడా, చంద్రబాబు అండ్ కో విదిల్చే తాయిలాల కోసం కక్కుర్తి పడి, వారు ఆడమన్నట్టు ఆడి దళితులను దారుణంగా మోసం చేశారు.  దళిత సోదరులకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తుంటే.. అడ్డుకోవాల్సింది పోయి, ఇది అన్యాయం అని నోటిఫైడ్‌ చేయాల్సింది పోయి.. దళిత జాతినే తాకట్టుపెట్టిన అధికారులు వారు. బదిలీలుకు వాళ్లు భయపడ్డారు అనేకంటే స్వంత లాభం చూసుకోవడానికే వారు లొంగిపోయారు. చంద్రబాబు, నారాయణ, పుల్లారావులు చెప్పినట్లు, వారి  మెప్పు కోసం పనిచేసి దళిత సోదరులను దారుణంగా వంచించారు. దళిత సోదరులకు అన్యాయం చేసినవారిని ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకూడదు.

రియల్టర్ బ్రహ్మనందారెడ్డి వీడియోలో దొరికిపోయాడు. ఆ వీడియోలో చూస్తే... సామాన్యులు బ్యాంక్‌ నుంచి లక్ష రూపాయలు తీయాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ కట్టలు కట్టలు డబ్బులు తీసుకువెళ్లి దళితులకు ఇచ్చారు. ఎంత ధైర్యంగా నీకేమీ ప్యాకేజీ రాదు, ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు సంతకాలు పెట్టాలంటూ.. దళితులను బెదిరిస్తూ ఎలా ప్రవర్తించారో చూడాలి. దళితుల భూములను కొట్టేయడానికి ప్రతి ఒక్క అధికారిని వదలకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి. ఈ కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను కొంతవరకు మాత్రమే మాట్లాడగలను, దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపించి విచారణ జరపాలి. దళిత సోదరులకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తీసుకు వచ్చిన జీవో నెంబర్‌. 41ను అడుగు అడుగునా అధిగమించారు. వాటి అన్నింటినీ పేరా వయిజ్‌ రిమార్క్‌ చేస్తూ కోర్టులో ఫైట్‌ చేయాల్సిందిగా సీఐడీ పోలీసుల్ని కోరుతున్నాను. చివరిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాను.  1940 కన్నా ముందు దళితులకు ఇచ్చిన పట్టాలు వారి వద్ద ఉన్నాయి. అప్పటి నుంచీ వాళ్ళంతా పంటలు పండించుకుంటున్నారే, వాళ్లను భయపెట్టి, బెదిరించి లాక్కున్న భూములను వారికే తిరిగి ఇప్పించాలి.

ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఎంత దారుణంగా వ్యవహరించారంటే భూములకు బౌండరీలు లేకుండా చేశారు. ఎవరైనా నిజమైన రైతు, చంద్రబాబు రాజధానిని తీసుకు వస్తున్నాడని నమ్మి భూములు ఇచ్చినా.. అటువంటి వారికి కూడా ప్యాకేజీ ఇవ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క ఊళ్లో, ఏ ఒక్క భూమికి కూడా బౌండరీ అనేదే లేకుండా తీసి అవతల పారేశారు. ఈ మొత్తానికి మాస్టర్‌ బ్రెయిన్‌ సాంబశివరావుదే. కచ్చితంగా అతని పాత్రను కూడా బయటకు తీయాలి. తిరిగి ఆ దళిత సోదరులకు భూములు అప్పగించి వారు తిరిగి వ్యవసాయం చేసుకునేలా చేయాలి. 

దళితులు ఎవరైతే మోసపోయారో, భయపడి భూములు అమ్ముకున్నారో వారికి న్యాయం జరిగేలా అందుకు అవసరం అయితే యాక్ట్‌ను అసెంబ్లీలో పాస్‌ చేసుకునేలా చేయాలని జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని కోరుకుంటున్నాను. దళిత సోదరుల భూములను లాక్కున్న వారిలో మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు లోకల్‌గా ఉన్నటువంటి అప్పటి జెడ్పీటీసీలు, మంగళగిరి, తుళ్లూరుకు చెందిన టీడీపీ నేతలు కీలక పాత్ర పోషించారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి. వీడియో ఆధారంగా ముందుగా ఆ భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్‌ చేయాలని కోరుతున్నాను. సీఐడీ అధికారులకు ఈ కాపీని అప్పగించి దర్యాప్తు ముందుకు సాగేలా చూడాలని కోరుకుంటున్నాను.

దళిత భూములను లాక్కునేందుకు ప్రస్తుత మాజీ ఐఏఎస్ సాంబశివరావు గుంటూరు కలెక్టర్‌ కార్యాయాలల్లో కూర్చుని రికార్డులు మొత్తం ట్యాంపరింగ్‌ చేయించారు. దీంతో దళిత సోదరులు మోసగించబడ్డారు. వాళ్లు మాత్రం సమాజంలో నిసిగ్గుగా తిరుగుతున్నారు. వారికి భయం లేదు, సిగ్గులేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా దళితులను మోసం చేశామే అన భావన వారిలో లేదు. ఈ కేసు విచారణ కోర్టు పరిధిలో ఉంది. పిటీషనర్‌గా నేను సేకరించుకున్న సమాచారాన్ని సీఐడీకి అందించాల్సిన అవసరం ఉంది.

అప్పట్లో చంద్రబాబు చెప్పినట్టు చేయను అని అన్న ఓ ఐఏఎస్ అధికారిని బదిలీ చేశారు కూడా. మిగతా కొంతమంది అధికారులు చంద్రబాబుతో కుమ్మకై అమరావతి స్కాంలో భాగస్వామ్యులయ్యారు. అధికారులు అయినా, రాజకీయ నాయకులు అయినా చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తే కుదరదు. చంద్రబాబు చెప్పిన తప్పుడు పనులను చేయనన్నందుకు నాగులపల్లి శ్రీకాంత్ అనే ఐఏఎస్ అధికారిని సీఆర్డీఏ నుంచి తప్పించి,  క్యాట్‌లో కేసులు ఉన్న చెరుకూరి శ్రీధర్‌ ను తీసుకువచ్చి సీఆర్డీఏలో పోస్టింగ్‌ ఇచ్చారు. మీడియాలో చూశాను.. దొరికాడు కాబట్టి, చెరుకూరి శ్రీధర్ ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నట్టు ఉన్నాడు. అలాఅని దొరకని ఇంకా కొంతమంది ఐఏఎస్ లు దొరలు కాదు. నేను ఎలాంటి తప్పులు చేయలేదు, రిటైర్డ్‌ అయ్యాను అని అనుకుంటే కుదరదు. ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే. అమరావతి రాజధానిలో చంద్రబాబు అండ్‌ కో దళితులను బెదిరించి వారి భూములను లాక్కున్నారని ప్రజలందరికీ తెలుసు. ఈ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు అంతా బయటకు రావాల్సిందే` అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

Back to Top