దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి

చంద్రబాబు, నారాయణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్‌

ప్లాన్‌ ప్రకారమే దళితుల భూములు కాజేశారు

కుటుంబానికో కథ.. మనిషికో వ్యధ మిగిల్చిన దుర్మార్గుడు చంద్రబాబు

అన్యాయాన్ని కప్పిపుచ్చడాన్ని స్టింగ్‌ ఆపరేషన్‌ ఎలా అంటారు..?

పీఓటీ, పీఓఏ చట్టాల అతిక్రమణ ఎందుకు వెలుగులోకి తీసుకురావడం లేదు..?

22ఏ నిషేధిత జాబితాలోని లంక భూములను గుమ్మడి సురేష్‌కు ఎలా కట్టబెట్టారు?

బ్రిటీష్‌ వాళ్లకు ఉండే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు..

బాబు కాజేసిన భూములు ఆ దళితులకు ఇప్పించాలని సీఎంను కోరుతా..

తాడేపల్లి: పక్కా ప్లాన్‌ ప్రకారం దళితుల భూములు కాజేసి.. కుటుంబానికో కథ.. మనిషికో వ్యధ చంద్రబాబు మిగిల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. స్టింగ్‌ ఆపరేషన్‌ అని గొప్పలు చెప్పుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు.. పీఓటీ, పీఓఏ చట్టాలను అతిక్రమించి చంద్రబాబు ఏం చేశాడు.. ఎమ్మెల్యే ఆర్కే కరెక్టా..? చంద్రబాబు, నారాయణ కరెక్టా..? అనే విషయాలు ఎందుకు వెలుగులోకి తీసుకురావడం లేదు..? ప్రశ్నించారు.  చంద్రబాబు, నారాయణ తప్పు చేయలేదని అనుకుంటే.. బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఆర్కే సవాల్‌ విసిరారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే ఏం మాట్లాడారంటే.. 

‘మోసగించబడ్డాం.. న్యాయం చేసి పెట్టండి.. చట్టాలు మాకు ఎన్ని అనుకూలంగా ఉన్నా కూడా చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా దోపిడీ చేశారని దళిత సోదరులు నా దగ్గరకు వచ్చి వినతిపత్రాలు ఇచ్చారు. వారి స్టేట్‌మెంట్‌ను సీఐడీ వాళ్లు ఆడియో, వీడియోల రూపంలో ఇప్పటికే తీసుకున్నారు. అది తెలుసుకున్న తరువాత టీడీపీ వాళ్లు మళ్లీ దళిత రైతుల దగ్గరకు వెళ్లి వారిని భయపెట్టి, బెదిరించి.. మేము చెప్పినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వండి అని టీడీపీ వాళ్లు చెప్పారు కాబట్టే.. ఆ విధంగా స్టింగ్‌ ఆపరేషన్‌ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. 

అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి.. తప్పు జరిగితే నిజాలు బహిర్గతం చేయడానికి స్టింగ్‌ ఆపరేషన్‌ సహజంగా చేస్తారు. అలాంటిది అన్యాయాలను కప్పిపుచ్చడానికి చేసే దాన్ని ఎలా స్టింగ్‌ ఆపరేషన్‌ అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడు జబ్బలు చరుచుకుంటున్నాయో అర్థం కావడం లేదు. 

2014 డిసెంబర్‌ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కూడా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో దళితులకు జరిగిన అన్యాయం మీద గొంతెత్తి.. అలుపెరగని పోరాటం చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. 2015 అక్టోబర్‌ నెలలో అన్యాయం జరిగిందని, చంద్రబాబు మోసం చేశాడని చెప్పిన దళిత సోదరుల స్టేట్‌మెంట్లు వార్తాపత్రికల్లో వచ్చాయి. 19–2–2016న నేను, మరో సీపీఎం నాయకుడు బాబురావు సాక్షాధారాలతో అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చాం. 

ఈ రోజు నా దగ్గరికి తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది సోదరులు వచ్చారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌ను కలవండి.. తరువాత వాళ్ల సూచనల మేరకు అవసరమైతే సీఐడీ అధికారులను కలవండి అని ఆ దళిత సోదరులకు చెప్పాను. ఆ ఊరు పేర్లు చెబితే టీడీపీ వాళ్లు వెళ్లి భయపెడతారని ఆ ఊరు పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. రేపు వాళ్ల స్టేట్‌మెంట్లు తీసుకుంటారు.. అప్పుడు అన్నీ బయటకొస్తాయి. 

1920లో సొసైటీలుగా ఏర్పడి.. ఆ సొసైటీల ద్వారా ఆనాడు దళిత సోదరుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి అప్పుడున్న బ్రిటీష్‌ ప్రభుత్వం డీకే పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల్లో 10 సెంట్లు, 33 సెంట్లు, 87 సెంట్లు ఇచ్చారు. 10 సెంట్లు కూడా ఒక దళిత సోదరుడికి ఆ రోజున ఉన్న బ్రిటీష్‌ ప్రభుత్వం ఇచ్చిందంటే.. బ్రిటీష్‌ వాళ్లకు ఉన్నæ ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. 

దోపిడీ కూడా పద్ధతిగా, పక్కా ప్లాన్‌గా చంద్రబాబు, నారాయణ చేశారనడానికి స్పష్టమైన ఉదాహరణలు ఉన్నాయి. అసైన్డ్‌ భూములు, మీకు నష్టపరిహారం రాదు.. ఇవ్వకపోతే ప్రభుత్వం లాగేసుకుంటుందని ప్రజల్లో భయాందోళన కలిగించి.. చౌకధరకు దళితుల భూములను టీడీపీ వాళ్లు లాక్కున్నారు. స్టింగ్‌ ఆపరేషన్‌ అని గొప్పలు చెప్పుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడును డైరెక్ట్‌గా అడుగుతున్నా.. పీఓటీ, పీఓఏ చట్టాలను అతిక్రమించి చంద్రబాబు ఏం చేశాడు.. ఆర్కే కరెక్టా..? చంద్రబాబు, నారాయణ కరెక్టా..? అనే విషయాలు ఎందుకు వెలుగులోకి తీసుకురావడం లేదు..? 

పీఓటీ, పీఓఏ చట్టాలను ఒకసారి చదివి.. ఆ చట్టాల ప్రకారం జీఓలు ఉన్నాయా లేదా అని తేలిస్తే స్టింగ్‌ ఆపరేషన్‌ ఒక్క నిమిషంలో బయటకు వస్తుంది. ధూలిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్యతో ప్రెస్‌మీట్లు పెట్టించే బదులు.. చంద్రబాబు, నారాయణ ఎందుకు బయటకు రావడం లేదు. బయటకు వచ్చి.. మోసం ఎక్కడ జరిగిందనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు. గౌరవ న్యాయస్థానం 4 వారాల లోపు కౌంటర్‌ దాఖలు చేయమని ఆదేశించింది. ఆర్టీఏ కింద తెప్పించుకున్నవి, నాకు లభించినవి.. నోట్‌ ఫైల్స్‌తో సహా మొత్తం కౌంటర్‌లో ఫైల్‌ చేసినప్పుడు అడ్డంగా దొరికిపోతారనే భయంతో ఈ మధ్యలో న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు, నారాయణ ప్రెస్‌ ముందుకు రావడం లేదు.  

అసైన్డ్‌ భూములు పీఓఏ, పీఓటీ చట్టాల ప్రకారం అమ్మకూడదు.. కొనకూడదు అని స్పష్టంగా ఉంది. ఆ చట్టాల మీద అమైన్‌మెంట్లు తీసుకురాకుండా.. మోసగింపబడే జీఓలు తీసుకొచ్చి దళితుల ఆస్తులను కొట్టేయడం ముమ్మాటికీ తప్పే. అసైన్డ్‌ భూములే కాదు.. కొన్ని లంక భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ గుంటూరు కలెక్టర్‌ 22ఏ కింద పెట్టారు. అంటే నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటిని రిజిస్ట్రర్‌ చేయడానికి వీల్లేదు. అయినా కూడా ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం గ్రామాల్లో లంక భూములు 150 – 200 మంది దళిత సోదరులకు చెందిన సుమారు 90 ఎకరాలు 22ఏ జాబితా కింద ఉంది. వాటిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదని ఉన్నా కూడా.. 22ఏ నిషేధిత జాబితాను ఎత్తివేయకుండా రిజిస్ట్రేషన్‌ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి గుమ్మడి సురేష్‌ అనే వ్యక్తికి ఎలా కట్టబెడతారు..? ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా 4 వేల ఎకరాలు కాజేశారు. 

50 వేల ఎకరాలు దళితులంతా స్వచ్ఛందంగా ఇచ్చారంటున్న చంద్రబాబు.. బ్రిటీష్‌వారే 1920లో తుళ్లూరు ప్రాంతంలో సొసైటీలను ఏర్పాటు చేసి భూములు ఇచ్చారే.. అలాంటి భూములను ఎందుకు లాక్కున్నారు. నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడానికి కలగని ఉంటే ఆ రాజధాని ప్రాంతంలోని 4 వేల ఎకరాల అసైన్డ్‌మెంట్‌ భూములు వారికే ఉండనివ్వొచ్చు కదా..? ఇలాంటి పనులు ఎందుకు చేయలేదు..? రాజధానిలో దళితులు ఉండకూడదని కంకణం కట్టుకున్న దుర్మార్గులు చంద్రబాబు, నారాయణ. 

వీళ్లిద్దరూ తప్పు చేయలేదని అనుకుంటే.. పబ్లిక్‌గా డిబేట్‌కు రమ్మని డిమాండ్‌ చేస్తున్నా. తల్లికి బిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో.. రైతుకు భూమికి అలాంటి సంబంధమే ఉంటుంది. 

ఏ దళిత సోదరుడిని అయితే చంద్రబాబు మోసం చేశాడో.. రాజ్యాంగ ప్రకారం దళితులకు ఉన్న హక్కులను కాలరాశాడో.. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకునే దళిత సోదరుడు తిరిగి భూమిని పొంది.. వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ను, ప్రభుత్వాన్ని కోరుతున్నా. శాసన రాజధాని అమరావతిలో దళితులు తలెత్తుకునే విధంగా.. రాబోయే రోజుల్లో చంద్రబాబు లాంటి దుర్మార్గులు భూములు కాజేసే సాహసం చేయకుండా వాళ్ల భూములు వారికి అందించాలి’ అని ఎమ్మెల్యే ఆర్కే సీఎం వైయస్‌ జగన్‌ను విజ్ఞప్తి చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top