చంద్రబాబు పాపాలు ప్రజలు మర్చిపోలేదు

జంగారెడ్డిగూడెంలో మరణాలపై టీడీపీ దొంగ లెక్కలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి 

అసెంబ్లీ: జంగారెడ్డిగూడెం ఘటన వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందేమోనని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో రంపచోడవరంలో జిలుగు కల్లు సంఘటన జరిగినప్పుడు నిందితుడు టీడీపీ ఇన్‌చార్జ్‌ వంతల రాజేశ్వరి సోదరుడు అని తేలిందన్నారు. ఏదో విధంగా రాజకీయ పబ్బం పడుపుకోవడానికి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతున్నాయన్నారు. చంద్రబాబు పాపాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.  అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడారు. 

ఏదో విధంగా గొడవపడాలనే దురుద్దేశంతో టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారని, మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. గత ప్రభుత్వంలో 3,880 వైన్‌షాపులు ఉంటే.. బెల్ట్‌షాపులు 45 వేలు ఉండేవి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో 2,984 షాపులు మాత్రమే ఉన్నాయని, సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక బెల్ట్‌షాపులను రద్దు చేశారని గుర్తుచేశారు. 

మద్యం సేల్స్‌లో చూసుకున్నా.. గత ప్రభుత్వంలో 2018–19లో 384 లక్షల కేసులు అమ్మితే.. 2020–21లో 187 లక్షల కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి. బీర్‌ అమ్మకాల్లో పోల్చుకున్నా.. 2018–19లో 277 లక్షల కేసులు అమ్మితే.. 2020–21లో కేవలం 56 లక్షల కేసులు మాత్రమే విక్రయించారు. 

కాటికాపారి మాదిరిగా.. టీడీపీ నేతలు శవాలను లెక్కబెట్టుకుంటున్నారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో 18 మంది సహజ మరణాలు జరిగితే.. దానిపై శవరాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 18 మందిలో ముగ్గురు మాత్రమే నాటుసారాతో చనిపోయారని తెలిసిందని, అందులో ఇద్దరి అంత్యక్రియలు అప్పటికే పూర్తయ్యాయన్నారు. ఒక్కరి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించడం జరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని,  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని జంగారెడ్డిగూడెం వెళ్లి ఏం జరిగిందని అధికారులతో చర్చించారన్నారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. 
 

Back to Top