వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌ల ఫలితంగా వైద్య రంగంలో అద్భుత ప్రగతి 

వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ 

క‌ర్నూలు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని వైఎస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ అశోక్ చెప్పారు. ముఖ్య‌మంత్రి ఉన్నత లక్ష్యాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. శ‌నివారం క‌ర్నూలు న‌గ‌రంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో వైద్య విభాగం జోనల్ ఇన్చార్జి డాక్టర్ హరికృష్ణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌భుత్వం వైద్య రంగంలో అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. 

 పేదలకు మెరుగైన వైద్య సేవలు
 ఏపీ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎంతో కృషి చేస్తోందని అశోక్‌కుమార్‌రెడ్డి, ఆదిమూల‌పు స‌తీష్ అన్నారు. వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నార‌ని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 వేల మందికి ఒక సబ్‌ సెంటర్‌ ఉండాలని చెబితే,  ఏపీలో ప్రతి 2 వేల జనాభాకు ఒక హెల్త్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గ్రామీణ వైద్య విభాగం బలోపేతానికి 10,032 వైయ‌స్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులను ప్రభుత్వమే గ్రామీణులకు ఉచితంగా అందిస్తోందన్నారు. టెలీ మెడిసిన్‌ ద్వారా పేదలకు ఉచితంగా స్పెషలిస్టు వైద్య సేవలను అందిస్తోందని, రోజూ 60 వేల కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. 

ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ దేశానికే ఆద‌ర్శం
దేశ చరిత్రలో తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్ని రాష్ట్రంలో తెచ్చార‌ని ఆదిమూల‌పు స‌తీష్ చెప్పారు. దీని ద్వారా గ్రామీణులకు స్థానికంగానే ఉచితంగా ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, మందులు అందుతున్నాయని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.2,750 కోట్లు, సెకండరీ వైద్య విభాగానికి రూ.1,223 కోట్లు, టెర్షియరీ వైద్య విభాగం మెరుగుకు రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారని, సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రానికి మూడు అవార్డులు
 ఇటీవ‌ల వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు ప్రతిష్టాత్మక అవార్డుల్లో రెండు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి. టెలీ కన్సల్టేషన్‌, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల అంశాల్లో ఏపీ అవార్డులు పొందింద‌ని వివ‌రించారు.  విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల అంశానికి మరో అవార్డు వ‌చ్చింద‌ని చెప్పారు.  చంద్రబాబు సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. 

చంద్ర‌బాబు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు:
గ‌తంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆరోగ్యశ్రీ పేషంట్లు భయపడే పరిస్థితి ఉండేద‌న్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండేవ‌న్నారు. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండేవారు కాదు. వసతులు కూడా లేవు. సెల్‌ఫోన్‌ లైట్లతో ఆపరేషన్లు చేసేవారు. ఆస్పత్రిలో పిల్లలను ఎలుకలు కొరికిన సంఘటనలు. 108, 104 వాహనాల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ నాలుగేళ్ల వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింద‌న్నారు. నాడు–నేడుతో  మొత్తంగా గవర్నమెంట్‌ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నార‌ని, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నామని చెప్పారు. ‘ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 రోగాల నుంచి ఏకంగా 2,466 రోగాలకు పెంచార‌ని వివ‌రించారు. వైద్య రంగంలో అమ‌ల‌వుతున్న సేవ‌ల‌ను గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు ఓం కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Back to Top