చం‍ద్రబాబుకు ఓట్లు అడిగే దమ్ముందా ?

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్‌

 కర్నూలు : ఏపీ సీఎం చం‍ద్రబాబు నాయుడు తాను చేసిన అభివృద్దిపై ఓట్లు అడిగే దమ్ముందా అంటూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్‌ విసిరారు. అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాత్రమే చంద్రబాబు పనికొస్తారని.. సీఎంగా పనికిరారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన జయహో బీసీ సభలో బీసీలకు ఆశాభంగం కలిగిందని ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇతర పార్టీలతో కలిసి చంద్రబాబు జయహో బీసీ అంటే..  వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసే బీసీ గర్జన అదరహో అనేలా ఉంటుందన్నారు. 

చంద్రబాబు కొత్తగా ఇస్తున్న హామీలన్నీ నవరత్నాల కాపీలేనని దుయ్యబట్టారు. టీడీపీ మోసపూరిత రుణమాఫీతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. దీంతో ప్రతీ వ్యక్తిపైన సగటున రూ.75 వేల అప్పు ఉందని ఆరోపించారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయని చంద్రబాబు మహిళలకు బాకీపడ్డారన్నారు. ఆడపడుచులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను సభల పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. 

బీసీలు జ‌డ్జిలుగా ప‌నికిరార‌ని లేఖ ఇచ్చిన ఘ‌నుడు బాబు
చంద్రబాబు ఇస్తున్న హామీలన్నీ ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలేనని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క‌ర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉంటూ మళ్లీ హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే తోకలు కత్తిరిస్తాననడం బాబు నైజమన్నారు. బీసీలు సుప్రీం కోర్టు జడ్జిగా పనికిరారని లెటర్‌ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. బీసీల హామీలపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు.  దివంగత సీఎం వైయ‌స్ఆర్‌ హయాంలో 11 బీసీ కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు నిజం కాదా అని ప్రశ్నించారు. తండ్రి బాటలో బీసీల సంక్షేమం కోసం ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జయహో బీసీ సభలో ఖాళీ కుర్చీలు తప్ప జనాలు లేకపోవడం చంద్రబాబు ప్రజావ్యతిరేకతకు నిదర్శనమన్నారు. బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్‌ విడుదల చేయబోతున్నారని తెలిపారు.
 
 

Back to Top