ఓట్ల తొల‌గింపుపై ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు

ద్వివేదిని క‌లిసిన  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లుఉమ్మారెడ్డి, కాసు మహేష్ రెడ్డి
 

అమరావతి :  ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే ఓట్ల తొలగింపు జరుగుతోందని వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం  వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డిలు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిశారు. గురజాల నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపుపై  ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. గురజాలలో 9500 ఓట్లు తొలగించారని తెలిపారు.

పోలీసులు యరపతినేని చెప్పుచేతుల్లో ఉన్నారు : కాసు మహేష్ రెడ్డి
గురజాలలో కొంతమంది పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ చెప్పు చేతల్లో ఉన్నారని వైయ‌స్ఆర్‌ సీపీ నేత, గురజాల ఇంచార్జి కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఓటర్ల అనుమతి లేకుండా ఓట్లు తొలగించాలని ఫారం 7ను ఇస్తున్నారని తెలిపారు. సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వెల్లడించారు.

 

Back to Top