కాకినాడ: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు అని పార్టీ మాజీ ఎంపీ వంగా గీతా అన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదన్నారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరమని అన్నారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా వారి లోటు తీర్చలేము అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరం. పార్టీలో ముఖ్యమైన, కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. పార్టీ నుండి ఎవరూ వెళ్ళినా.. వారి లోటు తీర్చలేము. పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళినా వైయస్ఆర్‌సీపీ కొనసాగుతుంది. పార్టీ అధినేత వైయస్ జగన్ చాలా దృఢమైన నాయకుడు. ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్ళడం.. మరి కొందరు చేరడం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైయస్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇదే విషయమై అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని వైయస్ జగన్ తయారు చేయగలరని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము.. అలాంటి వారిని ఆపలేం కదా?. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైయస్ జగన్‌కు తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.