రాజకీయాల్లో దూదేకులకు సముచిత స్థానం  

దూదేకుల ఆత్మీయ సమ్మేళనంలో వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు 

వైయ‌స్‌ఆర్‌ జిల్లా : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రంలో దూదేకుల సంక్షేమాభివృద్ధి జరుగుతుందని, రాజ‌కీయాల్లో వారికి స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని  మైదుకూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కడప నగర సమీపంలోని జయరాజ్‌ గార్డెన్స్‌లో నూర్‌బాషా దూదేకుల సంఘం ఆత్మీయ సమ్మేళనం దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్సరీ మహ్మద్‌ రఫీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, రిటైర్డ్‌ డీఐజీ, విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు మహ్మద్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజలను నానా అవస్థలకు గురి చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం దూదేకుల కులస్తుల ఓట్లను దండుకునేందుకే అనేక వాగ్దానాలు చేశారని, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో దూదేకుల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు, వీరిని బీసీ బీ నుంచి బీసీఏలోకి మార్చే అంశాలను పార్టీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే.. దూదేకుల కులస్తులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు వైయ‌స్‌ జగన్‌ను కేటీఆర్‌ కలిస్తే చంద్రబాబుకు ఎందుకు అంత భయమన్నారు. హరికృష్ణ మృతదేహం పక్కనే టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేసీఆర్‌తో చర్చలు జరిపి శవరాజకీయాలు చేయడానికి సిగ్గు లేదు కానీ.. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్‌ ఏ పని చేసినా అప్పుడే వక్రీకరించి మాట్లాడటం టీడీపీ నాయకులకు అలవాటై పోయిందన్నారు.

దూదేకుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధం
దూదేకుల సంక్షేమం కోసం ఎంతటి వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 1.3 లక్షల మంది దూదేకుల కులస్తులు ఉన్నారని, అందులో అనేక మంది కార్మికులుగా, కర్షకులుగా జీవితం సాగిస్తున్నారే తప్ప.. ఉన్నత స్థానాల్లోకి చేరుకోలేకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విద్య వైద్య, ఆహారం, వివాహాల కోసం రెండు విడతలుగా కోటి రూపాయలను సంఘం తరఫున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి.. ఆ మొత్తాన్ని వారి అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేస్తానన్నారు. దూదేకుల కులస్తులు హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ ముస్లిం మతాన్ని స్వీకరించి ఉన్నత స్థానానికి చేరారన్నారు.

వైయ‌స్‌ జగన్‌తోనే..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఉన్న దూదేకుల కులస్తులు అభివృద్ధి చెందడంతోపాటు న్యాయం జరుగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలకు డబ్బులను ఎర చూపి ఓట్లను కొల్లగొట్టాలని ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గం ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను అసహ్యంచుకొని, సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అమరావతి నిర్మాణం అంటూ గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారే తప్ప, ఇంత వరకు ఇటుక పెళ్ల పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు. కార్యక్రమంలో నూర్‌బాషా దూదేకుల సంఘం నాయకులు ఆలమూరు దస్తగిరి, పి.ఖాజా, బాబు, షఫి, ముంతాజ్‌ భేగం, మస్తాన్, విజయ ప్రతాప్, దంతలూరు ఖాసీం, హబీజుర రెహ్మన్‌ పాల్గొన్నారు.  

చంద్రబాబు జిమ్మిక్కులు చేయడంలో ప్రావీణ్యుడు
చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో దూదేకుల సంక్షేమానికి ఎటువంటి కృషి చేయలేదని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం తుంగలో తొక్కారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఆదరణ పథకం కింద పనిముట్లను అరకొరగా కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. దూదేకుల కులస్తులు ఎస్సీల కంటే అధ్వానంగా ఉన్నారని, నేటికి వారు పరుపులు కుట్టుకొని జీవనం సాగిస్తున్నారని, వాటికి కూడా డిమాండ్‌ లేకపోవడంతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న మైన్స్‌ను వారికి లీజులకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతోపాటు వారి జీవితాలు బాగుపడతాయన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన వృద్ధాప్య పెన్షన్‌ను చంద్రబాబు కాపీ కొట్టి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తానే ఇస్తానంటూ ప్రజలను మభ్య పెట్టడం సరికాదన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలని చెబుతున్న బాబు జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను బయటకు తీసుకువచ్చి.. వచ్చే ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడేందుకు సిద్ధం అయ్యారని ఆరోపించారు.

 

తాజా వీడియోలు

Back to Top