ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అంబేద్కర్‌ విగ్రహంపై దాడి

 జాతీయ ఎస్సీకమిషన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు
 

న్యూఢిల్లీ:  రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు,  సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్‌ విగ్రహంపై దాడికి పాల్ప‌డ్డార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధుల బృందం జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది. బుధ‌వారం న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను  వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద టీడీపీ శ్రేణుల దాడిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు నేతలు కమిషన్‌ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. 

నిందితులను శిక్షించాలి: డాక్టర్‌ గురుమూర్తి. ఎంపీ.
– ఆగస్టు 8న విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం మీద దాడి చాలా అమానుషం. నిందితులను పట్టుకోవడంలో, చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనత చూపింది. దీనిపై వైయస్సార్‌ సీపీ ఎస్సీ ప్రజా ప్రతినిధులం ఎస్సీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇలాంటి చర్యలు ఎవరూ చేయరాదని చెప్పారు. అంబేడ్కర్‌ గారి విగ్రహం అనేది జాతీయ సంపద అని ఆయన చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని సందర్శించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ హామీ ఇచ్చారు. 

ప్రభుత్వం స్పందించడం లేదు: మేరుగ నాగార్జున. మాజీ మంత్రి
– అంబేద్కర్‌ విగ్రహంపై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ముఖ్యమంత్రి, మంత్రులు సహా అధికారులెవరూ స్పందించలేదు. పోలీసు వ్యవస్థ కూడా కళ్లు లేని కబోదిలా ఉంది. వినతిపత్రం ఇచ్చి బాధ్యులపై కేసు పెట్టాలని కోరితే ఈరోజుకీ కేసు నమోదు చేయలేదు. అంబేడ్కర్‌ గారి విగ్రహం పెట్టిన స్థలాన్ని చంద్రబాబు గతంలో వేలం వేయాలని చూశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని పడగొట్టడానికి కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి.

అంబేడ్కర్‌ జాతి సంపద: ఆదిమూలపు సురేష్‌. మాజీ మంత్రి.
– విజయవాడలోని అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి అత్యంత హేయం. అక్కడి శిలాఫలకంపై జగన్‌గారి పేరు అంబేడ్కర్‌ కంటే పెద్దగా ఉందని, అందుకే తొలగించారని కొందరు మాట్లాడుతున్నారు. కానీ, అది నిజం కాదు. అంబేడ్కర్‌ విగ్రహంపైనే దాడి జరిగింది. ఏపీ ప్రజల గుండెచప్పుడు జగన్‌గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగా రూ.400 కోట్లతో విజయవాడ నడిబొడ్డున మనందరి దైవం, జాతి సంపద అయిన అంబేడ్కర్‌ గారి విగ్రహాన్ని ప్రతిష్టించాం. 

నందిగం సురేష్‌. మాజీ ఎంపీ.
– ఏపీలో బీఆర్‌ అంబేడ్కర్‌ గారి విగ్రహంపై దాడి చేసి ఇన్ని రోజులు అయినా చీమ కుట్టినట్లు అయినా లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం రాకముందు నుంచే ఆ పార్టీలోని కొందరు అంబేడ్కర్‌ గారి విగ్రహాన్ని పడగొడతామని బహిరంగంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇంత జరిగినా మాకు సంబంధం లేదన్నట్లుగా చెవిటి, మూగ వారిలా నటిస్తున్నారు. ఇదంతా రాష్ట్రం, దేశం మొత్తం చూస్తోంది. 

మొండితోక అరుణ్‌కుమార్‌. ఎమ్మెల్సీ.
– అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన వారు టీడీపీ గూండాలా? కాదా? ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఎందుకు సీసీ కెమెరాలు పని చేయలేదు? ఎందుకు కరెంటు తీసేశారు? ఎంతో భద్రత ఉన్న ఆ ప్రాంతం వద్ద భద్రతా సిబ్బంది ఏమయ్యారు? రోడ్డు మీద వెళ్లే ప్రజలు చూసి, స్పందించి గొడవ చేశారు. అక్కడే ఎస్పీ, కలెక్టర్, వెనకే గవర్నర్‌ ఉన్న ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చాలని ఎలా ప్రయత్నించారు? దుండగులపై ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయలేదు? వీలైనంత తొందరగా నిందితులను అరెస్టు చేయాలి. 

కైలే అనిల్‌ కుమార్‌. మాజీ ఎమ్మెల్యే.
– తాము అధికారంలోకి వస్తే అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూల్చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలోనే చెప్పడం వాస్తవం కాదా? విజయవాడలో ఆ స్థలంలో అంబేడ్కర్‌ గారి విగ్రహం పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదు. ఆ స్థలాన్ని గతంలో ఓ ప్రయివేటు కంపెనీకి ఇవ్వాలని భావించినప్పుడు మేధావుల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు వెనక్కి తగ్గి, ఇప్పుడు అక్కడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించాలనే ఆలోచన ఈ దాడుల వెనక ఉంది.

Back to Top