అనంత‌పురంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల అరెస్టు 

రాష్ట్రంలో అల్లర్లకు చంద్రబాబు కుట్ర

 బాబు డైరెక్షన్‌లోనే టీడీపీ నేతల వ్యాఖ్యలు

  సీఎం వైయ‌స్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

 ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే శాంతియుత నిరసన

 తక్షణం చంద్రబాబు, టీడీపీ నేతల్ని అరెస్ట్‌ చేయాలి

 ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి డిమాండ్‌

అనంతపురం  :  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌ల అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డితో పాటు మేయర్‌ వసీం, ఆహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్, వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేతలను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న వాహనానికి అడ్డుగా వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులు బైఠాయించారు. చివరకు పోలీసులు వారికి చెదరగొట్టి నాయకులను టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురంలోని జెడ్పీ సమీపంలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం వైయ‌స్ఆర్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ‘టీడీపీ ఒక సంఘ విద్రోహ పార్టీ’.. ‘జగనన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్డార్‌’..‘నీచ రాజకీయాలు మానుకో చంద్రబాబు’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల మనసులను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుచుకున్నారన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల మద్దతు కూడగట్టుకోలేని చంద్రబాబు.. డైవర్షన్‌ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఐదారు నెలలుగా సీఎం జగన్‌పై లోకేశ్‌ సహా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు, సుపరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, పట్టాభి అనుచిత వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తమ పార్టీ నేతలను అదుపులో పెట్టుకోవడం చేతకావడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వాడిన భాష సభ్య సమాజాం తలదించుకునేలా ఉందన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న క్రమంలో అల్లర్లు, అలజడులకు సృష్టిస్తూ నీచ, నికృష్ణ రాజకీయాలను చంద్రబాబు చేస్తున్నారన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు జీవితమంతా కుయుక్తులేనని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజలు పుట్టగతుల్లేకుండా చేశారన్నారు. పద్ధతి మార్చుకోకపోతే రాజకీయ ఉనికి లేకుండా చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలతో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని, అలాంటి ప్రజానాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైసీపీ నేతలు, అభిమానులు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఈ క్రమంలోనే కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారన్నారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి తాము శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నామన్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబును తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top