బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు

వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగింది

బ్లాక్‌ మనీ రికవరీలో కేంద్ర ప్రభుత్వం విఫలం

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి  ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లోని బ్యాంకుల్లో ఎంత బ్లాక్‌ మనీ ఉంది, స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్లు ఎంత ఉన్నాయో గుర్తించాలన్నారు. ప్రభుత్వ అంచనాలు కాకుండా, ప్రయివేట్‌ అంచనాల ప్రకారం ఈ బ్లాక్‌ మనీ రూ.70 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ఇందులో ఒక లక్ష కోట్లు కూడా రికవరీ చేయలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు.  ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి చెబుతూ..బ్లాక్‌ మనీ లక్ష 30 వేల  కోట్లు తీసుకువచ్చామన్నారని తెలిపారు. రూ.50 వేల కోట్ల విదేశీ ఆస్తుల రూపంలో ఉన్న వాటిని జప్తు చేశామని బడ్జెట్‌లో చెప్పారన్నారు. ఇవన్నీ కూడా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని అభివర్ణించారు. బడ్జెట్‌ విషయంలో ఏపీకి ఏ ఒక్క రెఫరెన్స్‌ కూడా లేదన్నారు. ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదన్నారు. ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రస్తావనే లేదన్నారు. విభజన చట్టంలోని హామీల ఊసే లేదన్నారు. గత నాలుగు బడ్జెట్లలో కూడా ఏపీకి ఎలాంటి ప్రయోజనం జరుగలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్‌డీఏలో ఉన్నా అప్పట్లో కూడా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగలేదన్నారు. 

 

Back to Top