తాడేపల్లి : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాల్లేకుండా.. పైగా దర్యాప్తు ఇంకా మొదలుకాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని? నిలదీసింది. దేవుడ్ని రాజకీయంలోకి లాగొద్దంటూ చురకలంటించింది. ఈ తాజా పరిణామాలపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్ధాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి వాడలేదనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వెంకటేశ్వరస్వామి ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది మంది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడ్డం సరి కాదన్నారు. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యి వాడలేదు కదా అని ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారని తెలిపారు. మరోవైపు జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్న సర్వోన్నత న్యాయస్ధానం... సిట్ నియమించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిందని గుర్తు చేశారు. త్వరలోనే ఈ వ్యవహారంలో అన్ని వాస్తవాలు బయటపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌తో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడి కావన్న వెల్లంపల్లి... చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన ఆధ్వర్యంలో పని చేస్తున్న సిట్, నివేదిక మరో రకంగా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అందుకే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని కోరుతున్నామన్నారు.