మీరు కలిస్తే పవిత్రం..మేం కలిస్తే అపవిత్రమా?

వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌

వైయస్‌ జగన్‌–కేటీఆర్‌ భేటీపై అసత్య ప్రచారం చేస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు

విజయవాడ: టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం చంద్రబాబు తన బావమరిది హరికృష్ణ శవం వద్ద మంతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని, ఆయన టీఆర్‌ఎస్‌తో కలిస్తే పవిత్రం..మేం కలిస్తే అపవిత్రమవుతుందా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు..వైయస్‌ జగన్‌ కేటీఆర్‌తో కలవడమే తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా కూడా వైయస్‌ జగన్‌–కేటీఆర్‌ భేటీని మరోరకంగా చూపించడం సరికాదన్నారు.

చంద్రబాబు కేసీఆర్‌తో కలిసేందుకు ఏ విధంగా తాపత్రయపడ్డారో నందమూరి హరికృష్ణ భౌతికకాయమే సాక్షమన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నట్లు గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసుంటే బాగుటుందని, ఐక్యంగా ఉంటూ గట్టిగా మాట్లాడితేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌తో కలిసేందుకు చంద్రబాబు కేసీఆర్‌ను బతిమాలుకోవచ్చు కానీ..వైయస్‌ జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేటీఆర్‌తో కలిస్తే అపవిత్రమవుతుందా అని ప్రశ్నించారు. మీరు కలిస్తే పవిత్రం..వేరే వాళ్లు కలిస్తే అపవిత్రమా అని నిలదీశారు. మీరు కలిస్తే చక్రం తిప్పడం, మేం కలిస్తే కుట్ర, అధర్మమా అని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు ఇష్టంగా లేరని వెల్లడించారు. 
 

Back to Top