ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు 

  కృష్ణా: కృష్ణా నది వరదల నేపథ్యంలో జగ్గయ్యపేట మండలంలో ముంపుకు గురైన రావిరాల, వేదాద్రి, ముక్త్యాల గ్రామాలలో ప్రభుత్వ విప్‌ సామనేని ఉదయభాను శనివారం పర్యటించారు. రావిరాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ముంపుకు గురైన వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలను పరిశీలించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేoద్రాలను, మెడికల్ క్యాంప్‌లను సందర్శించి అధికారులతో మాట్లాడారు.

ఉదయభాను తన సొంత ఖర్చుతో వరద బాధితులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన కుమారులు వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబులు సైతం ముంపు గ్రామాలను సందర్శించి  ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ వరదల వల్ల ఇళ్ళు కోల్పోయిన వారిని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులతో విచారణ చేయించి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తామని ఉదయ భాను అన్నారు.

ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని, అధికారులను  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే వైయస్‌ఆర్‌ సీపీ పార్టీ శ్రేణులు వరద ముంపుకు గురైన గ్రామాలలోని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఉదయభాను పిలుపునిచ్చారు.

Back to Top