ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి

కరోనా నియంత్రణలో ప్రభుత్వ చర్యలు భేష్‌

రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముమ్మర చర్యలు

వైయస్‌ జగన్‌ ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్ల  వైరస్‌ ప్రభావం తక్కువగా కనిపిస్తోంది

గాలి ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే వార్తల వల్ల ఆందోళన పెరుగుతోంది

వైయస్‌ఆర్‌సీపీ ముందు నుంచి సామాజిక కార్యక్రమాల పట్ల బాధ్యతగా వుంటుంది. 

 వైయస్‌ జగన్‌కు చంద్రబాబులాగా డ్రామాలు చేయడం చేతకాదు

  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

తాడేపల్లి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ ఇంకా కొన్ని రోజులు ఇళ్లకే పరిమితం కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రజలు తమను తాము రక్షించుకోవడం, ఇతరులకు తమ వల్ల వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాని సూచించారు. ప్రభుత్వ చర్యల వల్లే కరోనాను చాలా వరకు నియంత్రించగలిగామని చెప్పారు. ప్రతిపక్షాలు ఇలాంటి సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తక్కువ సమయంలో ఎక్కువ మందికి అంటుకునే వ్యాధి కరోనా. ప్రపంచమంతా గత మూడు నెలలుగా కరోనా వైరస్‌ వల్ల ఆందోళన చెందుతోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం అందరికీ అనుభవంలోకి వచ్చింది. కరోనా  సులభంగా రావడానికి అవకాశం వుందో... అంతే సులభంగా దానిని నియంత్రించ వచ్చనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రధాని, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంటి వారు కూడా అదే చెబుతున్నారు.     దానిని ఆచరణలో కూడా కిందిస్థాయిలోకి తీసుకువెళ్ళుతున్నారు.  ఇందులో భాగంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. సీఎం వైయస్‌ జగన్‌ కూడా ప్రతిరోజూ కరోనాపై సమీక్షలు జరుపుతున్నారు. ఉదయం, సాయంత్రం నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ కరోనా వైరస్‌ ను నియంత్రించడం, ప్రజల జీవన విధానం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ కరోనా వైరస్‌ పై ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో ఈ వైరస్‌ ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. అందువల్లే దేశంలోనే మన రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా వున్నాయని ఈ సందర్బంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏపీలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా ప్రభావం తక్కువగా వుంది. పక్కనే వున్న తెలంగాణా, కేరళ, రాజస్థాన్‌ రాష్ట్రాల మాదిరిగా తీవ్రంగా మనం ప్రభావితం కాలేదు.

సీఎం వైయస్‌ జగన్‌ కరోనా వైరస్‌ వార్తలు బయటకు వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. యాబై ఇళ్ళకు ఒక వాలంటీర్లను పెట్టి మన వ్యవస్థ ద్వారా ఎంత మంది విదేశాల నుంచి వచ్చారో సర్వే చేయించారు. ఫిబ్రవరి నెలాఖరులో ఇమ్మిగ్రేషన్‌ నుంచి సమాచారం రాకపోయినప్పటికీ వాలంటీర్ల ద్వారా విదేశీయుల వివరాలను ప్రభుత్వం సేకరించింది.     వస్తున్న ప్రమాదాన్ని గ్రహించి రాష్ట్రప్రభుత్వం, అధికారులు వలంటీర్ల ద్వారా ఈ సమాచారంను సేకరించి, దానిని హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌ కు అందించారు.  విదేశాల నుంచి వచ్చిన వారికి సకాలంలో టెస్ట్‌లు నిర్వహించడం వంటి ప్రక్రియ క్రమబద్దంగా నిర్వహించాం. దానివల్ల ఎటువంటి హంగామా లేకుండా... ఇప్పుడు జరుగుతున్న కరోనా ఆందోళనను సీఎం జగన్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సమర్థంగా ఎదుర్కొంటున్నాం.   ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనాను మనం చాలా వరకు నియంత్రించగలిగాం. ఇది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఒక ప్రభుత్వం ఏ సమయంలో ఎలా స్పందించాలని ప్రజలు కోరుకుంటారో అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం చేస్తొంది. కరోనా వైరస్‌ ను ఎదుర్కోవడాన్ని ఒక బాధ్యతగా, ఎటువంటి అట్టహాసం లేకుండా చేస్తున్నాం. ఈ చర్యల వల్ల వస్తున్న ఫలితాలతో అధికారులకు ధైర్యం పెరుగుతోంది.  మరోవైపు ఈ వైరస్‌ తొలిదశ నుంచి కొత్త తరహాలో మార్పులకు గురవుతోంది. ముందుగా ఇది వృద్దులకే ప్రమాదం అనుకుంటే.. ఇప్పుడు యువతకు కూడా ప్రమాదంగా పరిగణిస్తోంది. ముందుగా ముట్టుకుంటేనే ఈ వైరస్‌ వస్తుందని అనుకుంటే... ఇప్పుడు వాతావరణాన్ని  బట్టి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలుస్తోంది. వైరస్‌ సోకిన వ్యక్తిలో ఎక్కువ రోజులు వృద్దిచెందుతూ.. లక్షణాలు బయటకు కనిపించకుండా కూడా ఈ వైరస్‌ వుంటుందని తెలుస్తోంది. వాతావరణం అనుకూలంగా వుంటే ఎనిమిది గంటల వరకు ఈ వైరస్‌ గాలిలో వుండగలుగుతుందని డబ్లు్యహెచ్‌ ఓ చెబుతోంది.     మన పక్కనే మనిషి లేకపోయినా కూడా గాలి ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే వార్తల వల్ల ఆందోళన పెరుగుతోంది. దీనికి విరుగుడుగా ప్రజలు బయటకు పోకపోవడం, కొత్త వ్యక్తులతో సంబంధం పెట్టుకోకుండా వుండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.     మన ఇళ్లలోని పెద్దలు, వృద్దులను కాపాడుకోవాలంటే... ఇళ్ళలోనే కుటుంబసభ్యులు వుండాలని సీఎం కూడా ఇటీవల పిలుపునిచ్చారు. ౖ    గత మూడు రోజులుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కొంత ఇంప్రూవ్‌ మెంట్‌ వుంది. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన రావడం లేదు. ౖ    ప్రజలు హాలిడే మూడ్‌ లోకి పోయి, జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల వైరస్‌ మరింత విజృంభించే ప్రమాదం పొంచి వుంది. ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని ప్రభుత్వం చెబుతున్న దానిని ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు.  మొదటి రోజున సాయంత్రం పూట ప్రజలు బయటకు వచ్చి గుంపులుగా సంబరాలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. స్వీయనియంత్రణ రోజుల్లోనూ ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు. ప్రమాదం పొంచివుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇది హెచ్చరికతో వచ్చే ప్రమాదం కాదు... తెలియకుండానే వచ్చి... హాని చేసే ప్రమాదం ఇది.     ప్రజలు ఎక్కడ వుంటే... అక్కడే వుంటూ... ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చే వరకు జాగ్రత్తగా వుండాలి. ౖ    ప్రజలు తమను తాము రక్షించుకోవడం, ఇతరులకు తమ వల్ల వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వీయ నిర్భందంను ప్రజలు ఖచ్చితంగా పాటించాలి. ఇలా వుండకపోతే... మనకోసం పనిచేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పారా మెడికల్‌ సిబ్బంది, పోలీస్, అత్యవసర సర్వీసుల సిబ్బందిపై కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. ఆసుపత్రుల్లో ఇతర వ్యాధుల వల్ల చేరిన వారు కూడా మన అజాగ్రత్తతో వైరస్‌ బారిన పడటం వల్ల ఇబ్బంది జరుగుతుంది. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మాత్రమే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని భావించవద్దు. ఇప్పుడు ఈ వైరస్‌ మరింతగా వృద్ధిచెందుతున్న నేపథ్యంలో ఎవరి నుంచి అయినా వ్యాపించే ప్రమాదం వుంది. సెలవులు వచ్చాయని నగరాల నుంచి గ్రామాలకు వెళ్లేవారి వల్ల అక్కడ కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం వుంది. ప్రజలు ఇళ్ళలో వుండటం ద్వారా ప్రభుత్వం, అధికారయంత్రాంగం తమ పని తాము చేసుకునేందుకు సహకరించాలి. ప్రజలు బాధ్యతాయుతంగా ఇళ్ళలోనే వుంటూ... బయటకు వెళ్ళకుండా వుండాలని కోరుతున్నాం. నిత్యావసరాలు, ఆసుపత్రి సేవల వంటివి తప్ప ఇతర అవసరాలకు బయటకు వెళ్ళవద్దని కోరుతున్నాం. ప్రకృతి విపత్తుగా వచ్చిన ఈ ప్రమాదం నుంచి మనకు మనమే బయటపడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.     ప్రభుత్వం వల్లే ఈ వైరస్‌ ను నియంత్రించలేం. దీనికి ప్రజలందరి సహకారం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రమాదంను గుర్తించిన తరువాత అయినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తవారిని తమ ఇళ్ళకు ఆహ్వానించకూడదు. గ్రామాల్లోనూ ఇదే తరహాలో ప్రజలు అవగాహనతో వ్యవహరించాలి. అత్యవసర వస్తువులను కేవలం ఒక్కరిని బయటకు పంపడం ద్వారా మాత్రమే తెప్పించుకోవాలి. ఈ ప్రమాదంలోని మరోకోణం... ప్రజలు తమ కుటుంబాలతో ఎక్కువ కాలం గడిపే అవకాశంగా కూడా తీసుకోవాలి. రోడ్లమీద విధులు నిర్వహిస్తున్న పోలీసులు విపరీతమైన ఒత్తిడితో పనిచేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ముందు నుంచి సామాజిక కార్యక్రమాల పట్ల బాధ్యతగా వుంటుంది.     మా పార్టీ నేతలు రోడ్లమీదకు వచ్చి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ప్రాణాల కంటే విలువైనది ఏదీ కాదనే విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు. సమాజంలో ప్రభావితం చేసే ప్రోఫెసర్లు, టీచర్లు వంటి వారు కూడా ప్రజలకు నచ్చచెప్పాలని కోరుతున్నాం. శానిటైజర్లు, మాస్క్‌ లు కూడా లభించడం లేదు. ఇవి కూడా ప్రజల కోసం రోడ్ల మీదకు వస్తున్న వారికే అందేలా అందరూ సహకరించాలి.

హుద్‌ హుద్‌ సమయంలో చంద్రబాబు ఏం చేశారో తెలుసు.. అదో పెద్ద స్కాం. ఇవ్వన్నీ లేకుండానే సీఎం వైయస్‌ జగన్‌ ముందు నుంచే కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.     సరుకులు, రేషన్‌ ఇవ్వడంతో పాటు వెయ్యి రూపాయలను పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు లాగా దోమలపై దండయాత్ర అంటూ మేం హంగామా చేయడం లేదు. ౖ    సీఎం వైయస్‌ జగన్‌కు చంద్రబాబులాగా డ్రామాలు చేయడం చేతకాదు. ఈ విపత్కర పరిస్థితిపై ఎవరైనా రాజకీయంగా మాట్లాడితే వారి స్థాయి ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
 

Back to Top