ఎన్నికలు దగ్గరపడ్డాయని కొత్త నాటకాలు

వరాలు కురిపిస్తూ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం

ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రూ. 10,500 కోట్ల అప్పుకు యత్నాలు

టెంపరరీ పేరుతో లక్షల కోట్ల దోపిడీ

అవినీతి, దుబారాలకు తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గరపడ్డాయి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌: ఎన్నికలు దగ్గరపడుతున్నాయని చంద్రబాబు నాయుడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు అత్యంత వేగంగా నడిచే రీళ్లతో సినిమా చూపిస్తూ మధ్య పెడుతున్నాడని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా లేని ప్రేమ ఎన్నికలకు రెండు నెలల ముందు గుర్తొచ్చి వరాలు కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, దీన్ని ఎల్లో మీడియా ఆహా.. ఓహో అంటూ చూపిస్తుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో నిరుద్యోగ భృతి రూ. 2 వేలు అని చెప్పిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు దాన్ని అమలు చేయలేదన్నారు. ఎన్నికలు మరో ఆరు నెలలు ఉందనగా మూడు లక్షల మందిని గుర్తించి రూ. వెయ్యి చొప్పున ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నిరుద్యోగ భృతి నాలుగున్నరేళ్లుగా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఖాళీలు ఏర్పడిన స్థానాల్లో భర్తీలు లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారని సజ్జల అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదిన్నర క్రితం ప్లీనరీలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో నవరత్నాల ద్వారా ప్రజలకు వివరించిన పథకాలను చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు అమలు చేస్తున్నారన్నారు. ఉన్నట్టుండి పెన్షన్‌ రూ. 2 వేలు, తొమ్మిది గంటల కరెంటు అంటున్నారన్నారు. దీన్ని ఎల్లో మీడియా గొప్పగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలంటే చంద్రబాబుకు ఎంత చులకన భావమో అర్థం చేసుకోవాలన్నారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్ధానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా, కొత్త కార్యక్రమాలు ఒక్కటీ చేపట్టకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని సజ్జల ఎద్దేవా చేశారు. రూ. 96 వేల కోట్లు ఉన్న అప్పును చంద్రబాబు ఏకంగా రూ. 2 లక్షల కోట్లకు పెంచారన్నారు. ఇవేకాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చాలానే ఉన్నాయన్నారు. రాష్ట్రం దివాళా తీసిన పరిస్థితుల్లో ఉంటే నెలన్నరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా కొత్త నాటకాలు ఆడుతూ అధికారంలోకి రావడం కోసం కుయుక్తులు పన్నుతున్నాడన్నారు. దీన్ని ప్రజలంతా గమనించి చంద్రబాబును నిలదీయాలన్నారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో 0గా ఉన్న రెవెన్యూ డెఫిసిట్‌ 1.91 వేల కోట్లకు వెళ్లిందని వారే చెప్పారు. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారని సజ్జల ప్రశ్నించారు. రాజధాని మూవ్‌ చేయడానికి, విదేశాల ఖర్చు, దుబారాకు వేల కోట్ల రూపాయలను చంద్రబాబు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జీతాల కోసం కొత్తగా రూ. 10,500 ఆర్‌ఈసీ నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఖజానా అంత ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.

రుణామాఫీతో చంద్రబాబు రైతులను దగా చేశాడని మండిపడ్డారు. రైతులు చంద్రబాబు మాటలు నమ్మి జేబుల నుంచి బ్యాంకులకు వడ్డీ రూపంలో రూ. 40 కోట్లు కట్టారన్నారు. సున్నా శాతం వడ్డీ రుణాలు కూడా కోల్పోయారన్నారు. రుణమాఫీకి సంబంధించి ఆఖరి రెండు విడతలు జనవరి మొదటి వారంలో చెల్లిస్తామని చెప్పిన సోమిరెడ్డి ఇప్పటి వరకు చెల్లించిన దాఖలాలు లేవన్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొచ్చి చెల్లించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. కష్టాల్లో ఉన్నామని చెప్పడానికి ఒక పత్రం, మరోపక్క డబుల్‌ డిజిట్‌ సాధించామని మరో పత్రం చూపిస్తూ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా దీనావస్థలో ఉంటే చంద్రబాబు, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి జన్మభూమి కమిటీలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. వెల్‌కం గ్యాలరీకి రూ. 42 కోట్లు ఖర్చు చేశారన్నారు. టెంప్రరీ పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో 11 కిలోమీటర్ల పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించారని, విమానాశ్రయం నిర్మించారన్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఎందుకు ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని ప్రశ్నించారు. చేసిన అవినీతికి, దుబారాకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

Back to Top