కర్నూలు : పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు దుర్మార్గులకు సమాధి కట్టి... తమ పార్టీ అభ్యర్థులకు పట్టంగట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఓటమిని తట్టుకోలేక కొంతమంది టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పోలీసు అధికారులు ఒకరికి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. తమ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో సైనికుల్లాగా పనిచేస్తామని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. వైయస్ఆర్ సీపీ మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటి కట్టబెట్టారన్నారు. ప్రతీ కుటుంబానికి నవరత్నాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.