చంద్రబాబుకు ఒళ్లంతా విషమే

ఏపీ అభివృద్ధిని అడ్డుకునే వారితో చంద్రబాబు దోస్తీ

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వార్థ రాజకీయాలు

అవినీతి సొమ్ము తిని దేవినేనికి నోరు తిరగడం లేదు

ప్రత్యేక హోదా నినాదంతో పోరాడుతున్న మగాడు వైయస్‌ జగన్‌

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని

విజయవాడ: పాముకు కోరల్లోనే విషం ఉంటుంది కానీ, చంద్రబాబుకు, ఆయన తొత్తులకు నిలువెళ్లా విషం ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని ధ్వజమెత్తారు. పచ్చ మీడియాను, తొత్తులను అడ్డం పెట్టుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై విషం చిమ్మడం ఇప్పటికైనా కట్టిపెట్టాలని చంద్రబాబుకు సూచించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటూ పోలవరం, ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన వారిపై చంద్రబాబు దోస్తీ చేస్తున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కోదండరామ్‌ లాంటి వ్యక్తులను ఆలింగనం చేసుకొని అతనితో కలిసి చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేశాడని ధ్వజమెత్తారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలన్నీ కుదేలయ్యే పరిస్థితి వస్తుందని కోదండరామ్‌ మాట్లాడారన్నారు. అదే విధంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని పలారు నదిపై మినీ డ్యామ్‌ నిర్మిస్తుంటే లక్షలాది మందితో ధర్నా చేసిన డీఎంకే నాయకుడు స్టాలిన్‌తో చంద్రబాబు సావాసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిరాని ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ స్టాలిన్‌ బెటర్‌ దెన్‌ మోదీ అంటూ సాంబర్‌ అన్నం తింటూ ఆలింగనం చేసుకున్న అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఏపీకి వ్యతిరేకంగా ప్రతి అభివృద్ధిని అడ్డుకున్న స్టాలిన్, కోదండరామ్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లతో చంద్రబాబు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడన్నారు. 

ఇరిగేషన్‌ శాఖలో దోచుకున్న సొమ్ము తిని మంత్రి దేవినేని ఉమకు నోరు కూడా తిరగడం లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అని మాట్లాడుతున్న దేవినేనికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నాయా అని ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయలేదా అని నిలదీశారు. 2011లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తే బీజేపీతో కలిసిపోయాడని బురదజల్లారని, 2014 ఎన్నికల్లో పొత్తుకు మోదీ కాళ్లు çపట్టుకుంది తెలుగుదేశం పార్టీనే అన్నారు. టీడీపీ నేతల నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వైయస్‌ జగన్‌పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండ్‌ మీద ఉన్నారని, ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నారని పేర్ని నాని చెప్పారు. ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉండవు. ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారన్నారు. అయినా ప్రతిపక్ష పార్టీపై బురద జల్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు, ఆయన కోటరీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అని టీఆర్‌ఎస్‌ పార్టీతో కూడా చెప్పించిన ఘనత వైయస్‌ జగన్‌దన్నారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తామనే సింగిల్‌ ఎజెండాతో వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు సోనియాగాంధీతో చేతులు కలిపి వైయస్‌ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని, అయినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్‌గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడితే వారికి కూడా మద్దతు ఇస్తామని చెప్పిన మగాడు వైయస్‌ జగన్‌ అని పేర్ని నాని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఆయన తొత్తులు విషం చిమ్మే కార్యక్రమాన్ని కట్టిపెట్టాలని, బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 

 

Back to Top