ఫిబ్ర‌వ‌రి 4 నుంచి సమర శంఖారావం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

4, 5, 6వ తేదీల్లో చిత్తూరు, వైయస్‌ఆర్, అనంతపురం జిల్లాల్లో పార్టీ సమావేశాలు

రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే వైయస్‌ జగన్‌ పని చేస్తారు

చంద్రబాబుది రెండు నాలుకల సిద్ధాంతం

అన్ని సర్వేల్లో టీడీపీ ఓటమి ఖాయమైంది

హంద్రినీవా వెనుక వైయస్‌ఆర్‌ కృషి ఎంతో ఉంది

 

 

 తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర శంఖారావం పూరించింది. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 4, 5, 6వ తేదీల్లో చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లా, అనంతపురం జిల్లాల్లో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  వచ్చే నెలలో అన్ని జిల్లాల్లో సమర శంఖారావం పేరుతో బూత్‌ కన్వీనర్లు, బూత్‌ కమిటీ సభ్యులతో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం అవుతారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 4వ తేది చిత్తూరు జిల్లా, 5న  వైయస్‌ఆర్‌ జిల్లా, 6న అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో సమర శంఖారావం నిర్వహిస్తామన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లతో చర్చించిన తరువాత తిరుపతిలో ఎక్కడ సభ నిర్వహిస్తామన్నది వెల్లడిస్తామన్నారు. 

వైయస్‌ జగన్‌ 14 నెలల పాటు సుదీర్ఘకాలంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్నో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామని పెద్దిరెడ్డి చెప్పారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించామన్నారు. అన్ని సర్వేల్లో కూడా వైయస్‌ జగన్‌ దేశ రాజకీయాలను శాసిస్తారని తేలిందన్నారు. ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతారని స్పష్టమైందన్నారు. చంద్రబాబు మాదిరిగా  వైయస్‌ జగన్‌ చక్రం తిప్పుతారని మేం చెప్పడం లేదన్నారు.

దేశ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన వైయస్‌ జగన్‌కు లేదని, రాష్ట్ర ప్రయోజనాలే వైయస్‌ జగన్‌కు ముఖ్యమన్నారు. 
చిత్తూరు జిల్లాలోచంద్రబాబు పాలన ప్రతిబింబించడం లేదన్నారు. సొంత జిల్లాలో సీఎంకు వ్యతిరేకత ఉందన్నారు. మిగతా జిల్లాల ప్రజలు కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలన్నారు. గత ఎన్నికల్లో 102 మందిని గెలిపించుకున్న చంద్రబాబుకు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారన్నారు. తన పార్టీలో అనుభవజ్ఞులు లేరని తమ పార్టీ ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. తెలంగాణలో ఒక మాట..ఏపీలో మరో మాట మాట్లాడుతున్న చంద్రబాబు ద్వంద్వ వైఖరిని గమనించాలన్నారు. పుంగనూరుకు తాగునీరు ఇస్తామని అసెంబ్లీలో నన్ను చూసి ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు సాగునీరు, రాయలసీమకు తాగునీరు ఇస్తామన్న ముఖ్యమంత్రి వాగ్ధానం జీవోలకే పరిమితమైందన్నారు.

ఎన్నికల ముందు 2 టీఎంసీల నీరు ఇచ్చారని, ఈ నీరు రావడానికి కారకులు ఎవరన్నది ప్రజలు గమనించారని తెలిపారు. హంద్రినీవా వెనుక దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు.  వైయస్‌ఆర్‌ హయాంలోనే 83 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెప్పారు. హంద్రినీవా నేనే పూర్తి చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు రేపు జరిగే ఘనతంత్ర వేడుకల్లో రాజ్యాంగం గురించి మాట్లాడేందుకు సిద్ధమయ్యారన్నారు. 600 హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం రాజ్యాంగమా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలలో చంద్రబాబు కాపీ కొట్టారని, ఎన్నికలకు రెండు నెలల ముందే పింఛన్‌ రూ.2 వేలకు పెంచారని ఫైర్‌ అయ్యారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సొంతంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా అమలవుతుందన్నారు. చంద్రబాబు ఒక్కటైనా అలాంటి సంక్షేమ పథకం ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకానికి చంద్రన్న బాట అని పేరు మార్చారన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాలు తీసుకున్నారని, అక్కడ కట్టింది మాత్రం తాత్కాలిక భవనాలే అన్నారు. అవినీతికి పాల్పడుతూ..వైయస్‌ఆర్‌సీపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు గ్లోబెల్‌ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని తేలిందన్నారు. అధికారంలోకి రాకపోతే ఇబ్బందులు తప్పవనే భావనలో చంద్రబాబు తప్పుడు పనులు చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు, వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు కూడా ఉందన్నారు. ఈ కేసుల్లో చంద్రబాబుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒకే రోజు మూడు సభలు పెట్టి ఉద్దరిస్తానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం ఇటీవల అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఇందులో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
 

Back to Top