ఓటమి భయంతో ఆఖరి బడ్జెట్‌

కాకిలెక్కలు చూపుతూ ప్రజలను మభ్యపెట్టే యత్నం

ఎలాగూ ఇంటికి పంపిస్తారని తెలిసి అంకెలగారడీ

ఐదేళ్లలో చంద్రబాబు సాధించింది రూ. 2.9 లక్షల కోట్ల అప్పు

బీసీలను మోసం చేయడం చంద్రబాబుకు ఆటలా మారింది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

విజయవాడ: ఎలాగూ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపిస్తారని ఆఖరి బడ్జెట్‌ అంకెలగారడీతో రూపొందించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ఎప్పటిలాగే కాకి లెక్కలు చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లుగా ఉందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాగూ ఎన్నికలు వస్తాయి.. ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారన్నారు. రూ. 96 వేల కోట్లు ఉన్న అప్పును రూ. 2.9 లక్షల కోట్లుకు పెంచడమే ఐదేళ్లలో చంద్రబాబు సాధించగలిగారన్నారు. బడ్జెట్‌లో చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను పార్థసారధి ప్రజలకు వివరించారు. 

ఆధారాలు లేవు.. లెక్కలు లేవు

రెవెన్యూ రాబడి 2017–18లో రూ.1,05,062 కోట్లు చూపించారు. అదే 2018–19కి రూ.1,56,364 కోట్లు చూపించారు. దాన్ని సంవత్సరంలో అమాంతం పెంచేసి రూ. 1.78 లక్షల కోట్లు రాబడి వస్తున్నాయని చూపిస్తున్నారు. దీనికి ఆధారాలు లేవు. దీనికి లెక్కలు లేవు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే ఉద్దేశం తప్పితే బాధ్యత లేదు. 

రూ. 48 కోట్లు అదనంగా వస్తాయా..?

గ్రాంటినెట్స్‌ 2017–18లో రూ. 22,760 కోట్లు వస్తే, ఇప్పుడు రూ. 60,721 కోట్లు వస్తున్నాయని కాకి లెక్కలు చూపించారు. దాదాపు 48 వేల కోట్ల రూపాయలు అదనంగా రావడానికి అవకాశం ఉందా అని ఆలోచించాలి. అంకెల గారడీ అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. 

సమాధానం చెప్పాలి..

మొత్తం రాబడి 2017–18లో రూ. 1,91,950 కోట్లు ఉంటే 2018–19లో రూ.1,97,727 కోట్లు చూపించారు. ఈ సారి రూ. 2,25,705 కోట్లు వస్తుందని, దాదాపు రూ. 30 వేల కోట్లు ఏ విధంగా పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 

బాధ్యత లేకుండా బడ్జెట్‌

మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా.. బాధ్యత లేకుండా ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2016 అక్టోబర్‌ నుంచి డ్వాక్రా మహిళలకు రూ. 2,400 కోట్ల బకాయిలు ఉంటే కేటాయించింది ఈ బడ్జెట్‌లో రూ. 11 వందల కోట్లు మాత్రమే. దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరనే అంశంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి రోజు ఆర్బీఐ దగ్గరకు వెళ్లి చిప్పపట్టుకోవడం చూస్తున్నాం. 

భృతి కూడా మోసమే..

2017–18లో రూ. 500 కోట్లు కేటాయిస్తే ఒక్క పైసా ఖర్చు చేయలేదు. 2018–19లో రూ. వెయ్యి కోట్లు కేటాయించి ఖర్చు చేసింది రూ. 116 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్‌లో రూ. 12 వందల కోట్లు అంటున్నారు. నిరుద్యోగ భృతి ఎంత ఇవ్వాలని ఆలోచన చేశారు. కేటాయింపు రూ. వెయ్యికి సరిపోతుందా.. రూ. 2 వేలకు సరిపోతుందా సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు చేసే ఆలోచన ఉంటే ఈ బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లు కేటాయించాలి. కానీ రూ. 12 వందల కోట్లు కేటాయించారు. ఇది కూడా మోసమే.

చిత్తశుద్ధి లేదని స్పష్టమైంది..

రెవెన్యూ ఎక్స్‌పెండేచర్, క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ కలిపితే మొత్తం ఎక్స్‌పెండేచర్‌ వస్తుంది. కానీ, రెవెన్యూ రూ. 1.8 లక్షల కోట్లు, క్యాపిటల్‌ రూ. 29 వేల కోట్లు చూపించారు. మొత్తం రూ. 2.09 లక్షల కోట్లు మాత్రమే. బడ్జెట్‌ మొత్తం మాత్రమే రూ. 2.26 లక్షల కోట్లు చూపిస్తున్నారు. ఇదంతా బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ తప్పితే మరేది లేదు. బీసీ సబ్‌ప్లాన్‌కు రూ. 50 వేల కోట్లు అంటూ ఊదరగొడుతున్నారు. కానీ ఐదేళ్లలో కేటాయించింది రూ. 26 వేల కోట్లు, అందులో ఖర్చు చేసింది రూ. 16 వేల కోట్లు. అంటే చంద్రబాబుకు ఏ పథకంపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. 

అప్పుల్లో ఏపీ నంబర్‌ వన్‌ చేశాడు..

2014 సంవత్సరానికి ఆంధ్రరాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు రూ. 96 వేల కోట్లు అయితే 2017–18కి రూ. 2.59 లక్షల కోట్లు, ఈ సంవత్సరం రూ. 30 వేలు కలుపుకుంటే దాదాపు రూ. 2.9 లక్షల కోట్లకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేశాడు. ఐదేళ్లలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపానని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో నంబర్‌ వన్‌ చేయడమే చంద్రబాబు ఘనత. 

రైతు సుఖీభవం అంటూ మరో కుట్ర 

రైతులకు రూ. 5 వేల కోట్లతో రైతు సుఖీభవ అని బడ్జెట్‌లో ప్రకటించారు. ఏ విధంగా ఖర్చు చేస్తారు. రైతుకు ఎంత మేలు జరుగుతుంది. ఎకరానికి ఎంత ఇస్తారనే ప్రణాళిక లేకుండా రూ. 5 వేల కోట్లు కేటాయించామని చెప్పడం దుర్మార్గం. పచ్చ పత్రికలు తయారు చేసిన బడ్జెట్‌ను ప్రభుత్వం అమలు చేస్తుందేమో అర్థం కావడం లేదు. ప్రతికల్లో ఎకరానికి రూ. 25 వందలు, ఎందుకుంటే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ రూ. 12,500 ప్రతి రైతుకు ఇస్తానని చెప్పడంతో రూ. 5 వేల కోట్లు కేటాయించామని మరోసారి మభ్యపెట్టేందుకు కుట్ర. 

వైయస్‌ జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు

బలహీనవర్గాలను మోసం చేయడం చంద్రబాబుకు ఆటలా తయారైంది. ఆయనకు బీసీలంటే చులకన కాబట్టి ఎప్పుడైనా మోసం చేయగలననే ధైర్యంతో పనిచేస్తాడు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని పాదయాత్రలో బీసీలు అధికంగా కలిశారు. వివిధ కుల సంఘాల వారు కలిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, వృత్తిని గౌరవప్రదంగా నిర్వర్తించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి సమస్యలు విని పత్రికా ముఖంగా అక్కడే యాదవ కార్పొరేషన్, పద్మశాలీలకు, తూర్పు కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌ చెప్పారు. నాలుగున్నరేళ్లుగా బలహీనవర్గాల గురించి ఆలోచన చేయని చంద్రబాబు, బీసీలంతా వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారని అందరికీ కార్పొరేషన్లు ఇస్తామని మభ్యపెట్టే ప్రకటన చేస్తున్నారన్నారు. ఓటమి భయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాబట్టి జవాబు చెప్పే అవకాశం ఉండదని, తెల్లకాగితం నల్లగా చేసి చూపించే భావన. చంద్రబాబు ఐదేళ్లలో సాధించింది రాష్ట్రం మీద రూ. 2.9 లక్షల కోట్లు పెట్టడం తప్ప మరేమీ లేదని పార్థసారధి చెప్పారు. 

 

Back to Top