వైయస్‌ జగన్‌ ప్రకటనతో బీసీల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది

బీసీ డిక్లరేషన్‌తో బడుగుల్లో భరోసా కలిగింది

వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ

బీసీల తరఫున వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు

యనమల, కళా వెంకట్రావ్‌ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి

విజయవాడ: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో బీసీల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్‌తో బడుగుల్లో భరోసా కలిగిందన్నారు. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన వైయస్‌ జగన్‌కు ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం పార్థసారధితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జనలో మా నాయకులు వైయస్‌ జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని, సమాజంలో గౌరవప్రదమైన జీవితానికి వైయస్‌ జగన్‌ ఒక భరోసా కల్పించారన్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధతను తీసుకువస్తామని చెప్పారన్నారు. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది చెబుతామన్నారు.

బీసీ డిక్లరేషన్‌కు మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఏడాదికి రూ.15 వేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేసి ఆయా సామాజిక వర్గాలకు మేలు చేస్తామన్నారు. 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థిక చేయూతనిస్తామన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటుతో ఆ సామాజికవర్గాలకు ప్రతినిధులనే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమిస్తామన్నారు. ఆ సామాజిక వర్గాల సమస్యలను గుర్తించి..ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు.  139 సామాజికవర్గాలకు రాజకీయ ప్రాధాన్యత  ఇవ్వడమే కాకుండా..ప్రభుత్వ భాగస్వామ్యాలలో వైయస్‌ జగన్‌ గుర్తింపు ఇస్తారన్నారు. రాజకీయ ప్రయత్నాలకు వాడుకోకుండా, బీసీలకు అండదండలు అందించాలనే భావనతో వైయస్‌ జగన్‌ ఉన్నారన్నారు. కుల వృత్తితో జీవనం సాగిస్తున్న వారికి ప్రతి నెల రూ.2 వేలు ఆర్థికసాయం అందిస్తామని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారికి డీజిల్‌ సబ్సిడీ వర్తించే విధంగా..పెరుగుతున్న డీజిల్‌ ధరలకు అనుగుణంగా అందజేస్తామన్నారు. ఫిషింగ్‌ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం రూ.10 లక్షలు ఇస్తామన్నారు. వేట విరామ సమయంలో నెలకు రూ.10 వేలు ఇస్తామని వైయస్‌ జగన్‌ ఆ సామాజిక వర్గానికి భరోసా కల్పించారన్నారు.

అన్ని సామాజిక వర్గాలకు ఆర్థికంగా మేలు చేసేందుకు వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. తోపుడు బండ్లు, చిరువ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ఇలాంటి వారికి కార్డులు అందజేసి..బ్యాంకుల్లో జీవో వడ్డీకే రుణాలు అందించే వీలు కల్పిస్తామన్నారు. రజక, నాయీ బ్రహ్మణ, శాలివాహన కులాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి పథకాలు ప్రకటించిన వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన భరోసాకు టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకట్రావ్, యనమల రామకృష్ణుడు వక్రభాష్యంతో స్టేట్‌మెంట్లు ఇచ్చారన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను మోపిదేవి తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు ఏ రోజైనా కానీ మీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. కులాలలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేశారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇవాళ ఏపీ ప్రజలంతా కూడా వైయస్‌ జగన్‌ హామీలపై విశ్వాసంతో ఉన్నారని, అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. రేపు రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌కు అండగా ఉండాలని మోపిదేవి వెంకటరమణ విజ్ఞాప్తి చేశారు. 
 
 

Back to Top