కుళాయిలు తిప్పి ప్రాజెక్టు పూర్తి చేశాననడం సిగ్గుచేటు

హంద్రీనీవాను 80 శాతం పూర్తి చేసింది మహానేత వైయస్‌ఆర్‌

ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలకు నీరందించారో బాబు చెప్పాలి

ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ డ్రామాలు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

చిత్తూరు: కుళాయి తిప్పి హంద్రీనీవా ప్రాజెక్టు తానే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇంకో నెలలు ఎన్నికలు ఉన్నాయనగా మెయిన్‌ కెనాల్‌కు నీరు తీసుకొచ్చి పూర్తి చేశానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తెచ్చానని చెబుతున్న చంద్రబాబు ఎందుకు పిల్ల కాల్వలు పూర్తి చేసి రైతుల పొలాలకు నీరు ఇవ్వలేదని ప్రశ్నించారు. కుళాయిలు తిప్పి హంద్రీనీవా పూర్తి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

పునాదులకే పరిమితమైన హంద్రీనీవా ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసిన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. నాలుగున్నరేళ్లలో పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. అనంతపురంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని, అనంతకు హంద్రీనీవా నీరు తీసుకొచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చారో చెప్పాలన్నారు. ఎక్కడెక్కడ చెరువులు నింపారు. ఎక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించారో చెప్పాలన్నారు. మెయిల్‌ కెనాల్‌లో నీరు తీసుకొచ్చి కరువు తరిమేశామని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు ఇంకో నెల రోజుల్లో జరగనున్నాయనగా పెన్షన్లు పెంచాం.. రైతులకు మేలు చేస్తామని లీకులు ఇస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే ఏదో విధంగా అధికారం సంపాదించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. ప్రజలంతా చంద్రబాబు దుర్బుద్ధిని గమనించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top