చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు

వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున

రాష్ట్రంలో దళితులంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారు

దళిత నేత కత్తుల రవిపై కేసు ఎందుకు పెట్టారు

 దళితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది

 

ఏలూరు: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు చింతమనేని వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని మండిపడ్డారు. చింతమనేనిపై చర్యలు తీసుకొని ప్రభుత్వం దళిత నేత కత్తుల రవిపై అక్రమ కేసు బనాయించిందన్నారు. ఈ మేరకు కత్తుల రవిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు శుక్రవారం పరామర్శించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని కలిసి చింతమనేనిని అరెస్టు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు రాజకీయాలు ఎందుకు, పదవులు ఎందుకని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడితే..ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దళితులంతా వైయస్‌ జగన్‌ వెంట ఉన్నారు కాబట్టే..వారిని భయపెట్టేందుకు చంద్రబాబు చింతమనేని లాంటి రౌడీలను ప్రోత్సహిస్తున్నారన్నారు. దళితుల భూములు లాక్కున్న చింతమనేనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదన్నారు. చంద్రబాబుకు ఈ రోజు అధికారం ఉంటుందని, రేపు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రావొచ్చు అని పోలీసులకు సూచించారు. కత్తుల రవిపై ఎందుకు కేసు నమోదు చేశారన్నారు. ఆయన చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో దళితులకు నిలువ నీడ లేదన్నారు.

చంద్రబాబు వద్ద కొందరు దళితులను పెట్టుకున్నారని, ఆ నాయకులు కళ్లు లేని కాబోదులన్నారు. చింతమనేని ప్రభాకర్‌ దళితులను కించపరిచేలా మాట్లాడితే మంత్రి నక్క ఆనంద్‌బాబు మాట్లాడుతూ..మార్ఫింగ్‌ చేశారని పేర్కొనడం దారుణమన్నారు. మీకు కళ్లున్నాయా..మీరు దళితులేనా అని నిలదీశారు. దళితులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు వద్ద పాలేరు పని చేయవద్దని టీడీపీలోని దళిత నేతలకు హితవు పలికారు. మానవత్వం, అంబేద్కరిజమ్‌ ఉంటే దళిత వ్యతిరేకులను నిలదీయాలని సూచించారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేరుగు నాగార్జున డిమాండు చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు దళిత నేత రవిని పరామర్శించామని చెప్పారు. కత్తుల రవికి వైయస్‌ఆర్‌సీపీ, దళిత లోకం అండగా ఉంటుందని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ దళిత పక్షపాతి అని, దళితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులను అగౌరవపరిచినా..అమానుషంగా దాడులు చేసినా, చట్టాలు అపహాస్యం చేసినా వైయస్‌ఆర్‌సీపీ దళితులకు తోడుగా ఉంటుందని మాట ఇచ్చారు. చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు.  వీటన్నింటికి బాధ్యుడైన చంద్రబాబుకు రాష్ట్రంలోని దళితులు ఓటుతో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top