రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి..

జ్యోతి హత్యకేసులో పోలీసులు విఫలం..

ఏపీలో మహిళలకు రక్షణ లేదు..

అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా అమరావతి...

వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు 

విజయవాడ: జ్యోతి హత్యకేసులో పోలీసులు విఫలమయ్యారని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ హత్యకేసుపై పోలీసు యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు. టీడీపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బాధితులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం చేయలేని ముఖ్యమంత్రి  ఉన్నా ఒకటే..లేకపోయినా ఒకటేనని ప్రజలు భావిస్తున్నారన్నారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతామని,ప్రజలకు బాహుబలి గ్రాఫిక్స్‌ చూపిస్తున్న చంద్రబాబు..అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా .. ఎందుకు పోలీసు యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టలేకపోతుందని ప్రశ్నించారు. సాయంత్రం ఆరు దాటితే అమరావతి వెళ్ళాలంటే ప్రజలు భయాందోళనలకు గురిఅవుతున్నారన్నారు. దోపిడీలు,చోరీలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు అమరావతి కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు.

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు  టీవీల్లో  భారీగా ప్రకటనలు ఇచ్చారన్నారు. మహిళల సమస్యలు ఐదు నిముషాల్లో పరిష్కారం అవుతాయని  ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. కాని  నేడు మహిళలకు  భద్రత, భరోసా వుందా అని ప్రశ్నించారు. అమరావతి చుట్టు పక్కల ప్రాంతంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని.. వనజాక్షిపై దాడిచేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వైజాగ్‌లోని పెందుర్తిలో బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు.. ఒక దళిత మహిళను వివస్త్రను చేసిదౌర్జన్యానికి పాల్పడితే పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. నాగార్జున యూనివర్శిటీలో రితేశ్వరీ మీద ర్యాగింగ్‌ చేస్తే దోషులను శిక్షించలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు జరిగితే అక్కడకు వెళ్ళిన చంద్రబాబు..ఇదే అఖరు రోజు అంటూ గొప్పగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారని.. కాని ఇప్పటి వరుకూ సరైన చర్యలు లేవన్నారు. మహిళల మీద దాడులు జరుగుతున్నా  పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నికల సమయంలో మహిళలను మభ్య పెట్టి మోసగించే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. డ్వాక్రా సంఘాల అక్కాచెల్లెమ్మలకు ఒక సెల్‌ఫోన్, రూ.2500 చెక్‌ చేతిలో పెట్టి మహిళలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి మహిళలకు భద్రత లేకుండా పోతే..చంద్రబాబు మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి కత్తి తీసుకుని అరగంట వీరంగం చేశాడని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రాజధానిలో భూములు ఇవ్వని రైతుల అరటిచెట్లను తగలుపెట్టినప్పుడు,ఎమ్మార్వోపై దాడి జరిగినప్పుడు సీరియస్‌గా వ్యవహరించి ఉంటే.. నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో కబ్జాలు అధికంగా ఉన్నాయని,అధికార పార్టీ నేతలు బ్రాహ్మణుల ఆస్తులను లాక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

టీడీపీ పాలనలో 40 దేవాలయాలను కుప్పకూల్చారని మండిపడ్డారు. దేవాలయంలో ఉన్న చీరలను అధికార పార్టీనేతలే దొంగిలించిన పరిస్థితులు ఉన్నాయన్నారు.  తిరుపతిలో నగలు మాయమైన పరిస్థితి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో దేవుడికే దిక్కు లేకపోతే..సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో పోలీసుల ప్రతిష్ఠ మసకబారి పోయిందన్నారు. చంద్రబాబు పాలనలో.. పోలీసులు ప్రజల కోసం కాదు..టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపైనే దాడి జరిగిందని.ఇక  సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ప్రతి పక్షనేతపై దాడి జరిగిన కొద్దిక్షణాల్లోనే మీడియా ముందుకు వచ్చిన డీజీపీ.. అమరావతిలో హత్య సంఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరుకు పోలీసులు నోరు మెదపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

 

 

 

Back to Top