తాడేపల్లి:అమరావతి భూ కుంభకోణం అంశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే ధైర్యంగా సీఐడీ విచారణను ఎదుర్కోవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చాలెంజ్ విసిరారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి, కొత్త రాజధాని పేరుతో టీడీపీ అర్ధాంతరంగా హైదరాబాద్ నుంచి అమరావతిలో ఊడిపడి..ఎవరికి చెప్పకుండా, ఫలాని చోట రాజధాని వస్తుందని అందరిని మభ్యపెట్టి..చంద్రబాబు తన అనుయాయులకు మాత్రమే అమరావతిలో రాజధాని అని చెప్పి భూములు కొనుగోలు చేయించారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు రహస్యంగా ఉండాల్సింది పోయి..తన వారికి ముందే లీకులిచ్చి..తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయించి..రాజధానిని రియల్ ఎస్టేట్ ఏరియగా మార్చారు. గత ఐదేళ్లు యధేచ్చగా జీవోలు ఇచ్చి, వారికి అనుకూలంగా, కావాల్సిన విధంగా భూములు అప్పన్నంగా అప్పజెప్పారు. గత టీడీపీ పాలనలో అమరావతిలో భూ స్కామ్ జరిగింది. తప్పు ఎవరూ చేసినా కూడా శిక్ష తప్పదు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూంది. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. కానీ చంద్రబాబుకు విచారణ ఎదుర్కొనే అలవాటు లేదు. ఎప్పుడూ కూడా ఆయన స్టేలు తెచ్చుకుని బతుకుతున్నారు. కోర్టులో ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసుకుని తప్పించుకోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలి. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబును ఇవాళ చట్టాలు ప్రశ్నిస్తున్నాయి. న్యాయస్థానం బోన్‌లో ఆయన్ను నిలబెట్టబోతున్నారు. నిజమైన ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేశాను అనుకుంటే ఇవాళ ఆయన ధైర్యంగా సీఐడీ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే..ఆయన్ను శాశ్వతంగా ఏపీ ప్రజలు బహిష్కరిస్తారని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.