ఎన్నికల ప్రత్యేక క్యాంపులను స‌ద్వినియోగం చేసుకోండి 

వైయస్‌ఆర్‌సీపీ నేత కన్నబాబు పిలుపు 
 

కాకినాడ‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ బూత్‌లలో శని,ఆదివారాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్న తరుణంలో పార్టీ బూత్‌ కన్వీనర్లు, కమిటీ సభ్యులు చురుగ్గా వ్యవహరించి, ఓట్లు ఉన్నాయో లేదో స‌రి చూసుకోవాల‌ని వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. నేడు,రేపు..ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు వరుకు నిర్వహించే ప్రత్యేక క్యాంపులలో పార్టీ తరపున నియమితులైన బూత్‌  స్థాయి సహాయకులు,బూత్‌ కన్వీనర్లు,కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.

బూత్‌స్థాయి అధికారులతో పోలింగ్‌ బూత్‌లో తాజాగా ఓటర్ల జాబితాతో పరిశీలించుకోవచ్చన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్ల నమోదు కోసం ఫారం–6,పేరు తొలగింపులకు ఫారం–8, అదే నియోజకవర్గంలో వేరే బూత్‌లోకి అడ్రస్‌ మారిన వారి కోసం ఫారం–8 ఎ అందుబాటులో ఉంటాయన్నారు. ఎపిక్‌ కార్డు(ఓటరు గుర్తింపు కార్డు) కలిగి ఉన్నప్పుటికీ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదని, ఓటర్ల జాబితాలో పేరు ఉందా,లేదా అన్న విషయాన్ని తప్పకుండా పరిశీలించాలని సూచించారు. పేరు లేకపోతే వెంటనే ఫారం–6లో వివరాలు పొందుపరిచి,ఫోటో,వయస్సు,చిరునామా ధ్రువీకరణపత్రాలు జతపరిచి అక్కడ ఉన్న బీఎల్వోకు అందజేయాలన్నారు. ఓటర్ల సవరణకు ఈ రెండు రోజుల్లో సమర్పించిన అన్ని వినతి ప్రతాలపై విచారణను పూర్తి చేసి మార్చి 7 నాటికి ఎన్నికల సంఘం తగు చర్యలు చేపట్టనుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేలా పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లు,కమిటీ సభ్యులు సంసిద్ధంగా ఉండాలని కోరారు..
 

Back to Top