పొత్తులు మాకు అవసరం లేదు

పవన్‌ కల్యాణ్‌ మాటలు అర్థరహితం

టీఆర్‌ఎస్‌ తరుఫున ఎవరొచ్చి కలిశారో చెప్పాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి

విజయవాడ: చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్‌ కల్యాణ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలకు దిగుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ద్వారా వైయస్‌ఆర్‌ సీపీ జననేనతో కలవాలని చూస్తోందన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్‌ మనసులో వైయస్‌ఆర్‌ సీపీతో కలవాలని ఉందో..? వైయస్‌ఆర్‌ సీపీ అండ లేకపోతే సీట్లు రావనో..? తెలుగుదేశం పార్టీ బంధాలను బయటపెట్టేందుకు సంకోచిస్తూ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ తరుఫున ఎవరు పవన్‌ను కలిశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్‌ను కలవలేదని, ఒక్కసారి ఆయన్ను అభినందించడానికి ఫోన్‌ చేసి మాట్లాడానని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. పవన్‌ను వైయస్‌ఆర్‌సీపీతో కలపడానికి ఏ శక్తులు పనిచేస్తున్నాయో చెప్పాలన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్‌ మాట్లాడుతున్నాడన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదన్నారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకి అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు జంకుతున్నారని పార్థసారధి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే వాస్తవాలు తెలుసుకోవాలని ఎన్‌ఐఏకి అప్పగించాల్సిన చంద్రబాబు, దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గౌరవ న్యాయస్థానం కేసును ఎన్‌ఐకి అప్పగించాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఎన్‌ఐఏకి కేసు బదలాయింపును అడ్డుకునేందుకు చంద్రబాబు అనేక కుట్రలు చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలాగా, ఫెడరల్‌ వ్యవస్థకు భంగం కలిగినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలు కేంద్రంతో కాపురం చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ సాధించలేనప్పుడు ఎందుకు బాధ కలగలేదని ప్రశ్నించారు. 

 

Back to Top