కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారు బాబూ?

చంద్రబాబు టక్కు టమార విద్యలు మొదలుపెట్టారు

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు రిజర్వేషన్లు

కాపులను మళ్లీ మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం 

ఇంత దగా, మోసం ఎక్కడా ఉండదు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి  కన్నబాబు

కాకినాడ: కాపులను ఎన్నిమార్లు మోసం చేస్తారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కన్నబాబు చంద్రబాబును ప్రశ్నించారు. కాపులంటే ఎందుకంత అలుసు అని నిలదీశారు. కేంద్రం ఈబీసీలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు  ఇస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాకినాడలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుబోతున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో అధికార తెలుగు దేశం పార్టీ ఓట్లు రాబట్టేందుకు వివిధ వర్గాలను మోసం చేసి పబ్బం గడపాలన్న ఆలోచనలో ఉందన్నారు.

చంద్రబాబు మళ్లీ టక్కు టమారా విద్యలు మొదలు పెట్టారన్నారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సున్నితమైన కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని, ప్రత్యేకించి కొన్ని వర్గాలను చంద్రబాబు వంచించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా వాడుకునే ఆలోచన లో ఉన్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా మోసం చేశారో చూశామన్నారు.

అలాంటి ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటన చేసి..ఏకంగా రిజర్వేషన్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్రం ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడి ఉన్న అన్ని అగ్రవర్ణాల పేదలకు వర్తిస్తుందన్నారు. అందులో కులాల ప్రస్తావన లేదన్నారు. అందులో ఐదు శాతం కాపులకు ఇస్తామని చెప్పడం మరోసారి కాపులను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. మళ్లీ కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తావని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని, ఆరు నెలల్లో కమిషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. కాపులు రోడ్డుపైకి వస్తే అప్పుడు మంజునాథ్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. కమిషన్‌ చైర్మన్‌ నివేదిక ఇవ్వకముందే హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు చెప్పారన్నారు.

కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే టీడీపీ నేతలు స్వీట్లు పంచుకొని విజయోత్సవాలు చేశారన్నారు. 5 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో గతంలో టీడీపీ చేసింది మోసమని తేలిపోయిందన్నారు. ఈబీసీలోని పది శాతంలో ఐదు శాతం కాపులకు ఇచ్చే అవకాశం ఉందా అని నిలదీశారు. దీనిపై ప్రభుత్వ పరంగా ఏమైనా అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. శాస్త్రియత ఉందా అని ధ్వజమెత్తారు. అగ్రవర్ణ పేదలను కాపులకు వ్యతిరేకం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలా చేయడం తప్పు అని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ప్రకటనలు ఇచ్చి అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటూ కాపులను మభ్యపెట్టడం సరికాదన్నారు. మీ చర్యలతో ఓ సామాజిక వర్గం మోసపోతుందన్నారు. ప్రజల మధ్య వివాదాలు రేపే ప్రయత్నాలు మంచివి కావని హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో ఏవిధంగా అమలు చేస్తారని అన్ని వర్గాల ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. కాపులు ఆకలి కేకలు వినిపిస్తే చంద్రబాబు జైల్లో పెట్టించారని తెలిపారు. కాపులంటే చంద్రబాబుకు ఎంతకింత అలుసు అని ప్రశ్నించారు. 
 

Back to Top