సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన ఆదర్శం

ఏపీలో కరోనా నివారణ చర్యలు ప్రశంసనీయం

దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదే

వాలంటీర్ల ద్వారా అనుమానితులను గుర్తించే కార్యక్రమం సమర్ధవంతంగా జరిగింది

అనేక దేశాల్లో అవలంభిస్తున్న విధానాలు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తోంది

విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదే

గత ప్రభుత్వంలో పసుపు చొక్కాలకే పనులు

మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచింది చంద్రబాబే

పేదవాడి మనసెరిగి సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారు

ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్షాలకు లేదు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

 

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు ప్రశంసనీయమన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇన్ని పరీక్షలు చేయలేదని స్పష్టం చేశారు. అనుమానితులందరిని వాలంటీర్లు సమర్ధవంతంగా గుర్తించారని, అనుమానితులందరికీ పరీక్షలు చేయడంతోనే ఈ ప్రభుత్వం కరోనాపై విజయం సాధించిందన్నారు.  విపత్తుల సమయంలో పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మద్యపానానికి తూట్లు పొడిచిన చంద్రబాబే అని ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు.

ఇదే విజయ రహస్యం..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్‌ వ్యవస్థ కరోనా నియంత్రణలో సమర్ధవంతంగా పని చేసిందని, అనుమానితులందరిని గుర్తించడమే కరోనా కట్టడికి విజయ రహస్యమని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోలిస్తే మన రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనానను సకాలంలో, సమూలంగా నిర్మూలించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో, ఎంత డబ్బు ఖర్చైనా వెనుకడుగు వేయకుండా నిర్ణయాలు తీసుకోవడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వ పనితీరుతోనే ఇది సాధ్యమైందన్నారు. కరోనా టెస్టులు దేశంలోనే ఏపీలో అత్యధికంగా చేశారన్నారు. అనుమానితుడైన ప్రతి పౌరుడికి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. అనుమానితులను గుర్తించే కార్యక్రమం సమగ్రంగా జరిగిందన్నారు. 

వాలంటీర్లు సమర్ధవంతంగా పని చేశారు
ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించిందని, వీరు కరోనా నియంత్రణలో సమర్ధవంతంగా పని చేశారని ధర్మాన పేర్కొన్నారు. వాలంటీర్లు స్థానికులు కావడం, తమ పరిధిలోని ఇళ్లలో ఏం జరుగుతుందో వీరు గమనించారన్నారు. ప్రతి ఇంట్లో మార్పులు గమనించే శక్తి వాలంటీర్‌కు ఉండటంతో కరోనా అనుమానితులను గుర్తించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా జరగలేదన్నారు. అందుకే ఏపీలో రోజు రోజుకు కరోనా పరీక్షలు అధికంగా చేస్తున్నారని, పరీక్షలు ఎక్కువ చేయడంతో పాజిటివ్‌ కేసులు ఎక్కువగానే బయట పడుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో ప్రతి రోజు 7 వేలు, 8 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దక్షిణ కొరియా దేశం కూడా ఇలాంటి విధానాన్ని అవలంభించడంతోనే కరోనాపై విజయం సాధించిందన్నారు.  మన రాష్ట్రమే సరైన డైరెక్షన్‌లో వెళ్తుందని ధర్మాన పేర్కొన్నారు.

పౌరులకు నిజాలు తెలుసు
సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిజాయితీగా పరిపాలన సాగిస్తున్నారని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కాదన్నా..ప్రతి పౌరుడికి నిజాలు తెలుసు అన్నారు. ప్రతిపక్షాల తీరు సరిగాలేదని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందన్నారు. ఇప్పటికే మూడు సార్లు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేసిందని, ప్రతి ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం చేసిందన్నారు. గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను స్వస్థలాలకు రప్పించేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. కార్వంటైన్‌ కేంద్రాల్లో అన్ని వసతులు, పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. అక్కడ అమలవుతున్న మెనూ గతంలో ఏ పునరావాస కేంద్రంలో కూడా చూడలేదన్నారు. 

గత ప్రభుత్వంలో టీడీపీ జెండా కట్టుకుంటేనే పథకాలు
గత ప్రభుత్వంలో ఇంటిపై టీడీపీ జెండా కట్టుకున్న వారికే సంక్షేమ పథకాలు అందేవని ధర్మాన విమర్శించారు. పచ్చ చొక్కాలకే పనులు జరిగేవన్నారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పేదలకు భరోసా ఇవ్వడం అంటే వైయస్‌ జగన్‌ పరిపాలనే నిదర్శనమన్నారు. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పచ్చ చొక్కాలు పంచుకున్నారని, బాధితులకు ఎలాంటి సాయం చేయలేదన్నారు.  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూనే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపులు చేస్తూ పేదలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకాలు ఈ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేసిందన్నారు.  ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.

దశలవారిగా మద్యపాన నిషేదం
రాష్ట్రంలో దశల వారిగా మద్యపాన నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించిందని, బెల్టుషాపులు మూత వేయించామన్నారు. బార్ల సంఖ్య కుదించినట్లు చెప్పారు. గతంలో ఎన్టీ రామారావు 1987లో మద్యపాన నిషేదానికి చర్యలు తీసుకుంటే, ఆ తరువాత అధికారం చేపట్టిన చంద్రబాబు మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన మనుషులు మద్యపానం గురించి నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క బెల్టుషాపు అయిన మూత వేయించాడా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటించలేరని, వైయస్‌ జగన్‌ నిజాయితీగా పని చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. పేదవాడి మనసెరిగి సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారని, ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు.
 

Back to Top