విజయవాడ : తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైయస్ఆర్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారు. నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.. నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైయస్ఆర్‌సీపీ పార్టీ. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది.