అర్జుడినై నందికొట్కూరును కాపాడుకుంటా

వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
 

కర్నూలు: కుటిల రాజకీయాల నుంచి నందికొట్కూరు నియోజకవర్గాన్ని అర్జుడినై, విజయుడినై కాపాడుకుంటానని వైయస్‌ఆర్‌సీపీ నందికొట్కూరు సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. నందికొట్కూరులో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలు ఎవరు కూడా మరిచిపోవద్దని సూచించారు. చంద్రబాబును ఎవరూ నమ్మండం లేదని..అందుకే నిన్ను నమ్మం బాబు అంటున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్న నాయకులు 30 ఏళ్ల నుంచి కొట్టుకున్నారు. తన్నుకున్నారు.. ఇవాళ ఒక్కటయ్యారని విమర్శించారు. మనం ఇక్కడ రాజకీయాలు  మానుకుంటే నియంత పాలన సాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు ఈ నియోజకవర్గాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పోరాడుదామా? బానిస బతుకులు బతుకుదామా మీరే తేల్చుకోండి అన్నారు. నేను చేతులెత్తేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పలకనని స్పష్టం చేశారు. విజయమో..వీర స్వర్గమో నా చివరి శ్వాసవరకు పోరాటం చేస్తానని, వైయస్‌ఆర్‌సీపీ గెలుపు కోసం ఉద్యమిస్తానని వెల్లడించారు. ఈ రోజు ఏ పేపర్‌ చూసినా, ఫేస్‌బుక్‌ చూసినా సిద్ధార్థరెడ్డి ఒక అభిమాన్యుడు అంటున్నారని, పద్మవ్యూహంలో చిక్కుకున్నారని చెబుతున్నారని తెలిపారు. ఈ కుటిల రాజకీయాలకు నందికొట్కూరు నియోజకవర్గం బలి కాకుండా ఉండేందుకు అభిమాన్యుడినైన నేను అర్జునుడినై, విజయుడనై నందికొట్కూరును కాపాడుకుంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పేర్కొన్నారు. 

Back to Top